fathers day special: sakshi interview with sai kumar family - Sakshi
Sakshi News home page

ఫాదర్స్‌ డే స్పెషల్‌: సాయికుమార్‌ ఫ్యామిలీ వాయిస్‌!

Published Sun, Jun 20 2021 12:10 AM | Last Updated on Wed, Mar 2 2022 7:01 PM

Sai kumar Family Sakshi Interview On Fathers Day

ఆది, సాయికుమార్, జ్యోతిర్మయి

‘‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్‌’’... సాయికుమార్‌ కెరీర్‌కి తొలి బ్రేక్‌ అయిన ‘పోలీస్‌ స్టోరీ’ చిత్రంలోని డైలాగ్‌ ఇది. సాయికుమార్‌ ఇంటి నాలుగు స్తంభాల్లో ముగ్గురు మన కళ్ల ముందు ఉన్నారు. కనిపించని నాలుగో స్తంభం పీజే శర్మ. ఈ మూడు స్తంభాల బలం ఆ నాలుగో స్తంభం. ఆ బలంతో సాయికుమార్‌ కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. నేడు ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా సాయికుమార్‌ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ‘సాక్షి’తో చెప్పిన విశేషాల్లో కొన్ని...

స్వరం నాన్నది.. సంస్కారం అమ్మది

– సాయికుమార్‌


► నా స్వరం నాన్న (ప్రముఖ నటుడు పీజే శర్మ) గారిది. సంస్కారం అమ్మ (కృష్ణజ్యోతి) ఇచ్చింది. ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అభిమానం ప్రేక్షకులందరిదీ. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్‌. ఈ విషయంలో ఆది, జ్యోతిర్మయి చాలా లక్కీ (నవ్వుతూ). నాన్నగారి నుంచి నాకు, నా నుంచి నా పిల్లలు ఆది, జ్యోతిర్మయికి క్రమశిక్షణ అలవడింది.

► మా నాన్నగారు హీరో అవ్వాలనుకున్నారు. అమ్మకి హీరోయిన్‌ అవ్వాలని ఉండేది. కానీ అప్పట్లో ఉన్న పోటీ, వారి వ్యక్తిగత పరిస్థితుల వల్ల వారు ఊహించిన స్థాయిలో కుదర్లేదు. కుటుంబం కోసం అమ్మ త్యాగం చేయాల్సి వచ్చింది. పీజే శర్మ ఎంత కాలం ఇండస్ట్రీలో ఉంటారు.. మళ్లీ తిరిగి అగ్రహారం వచ్చి పౌరోహిత్యం చేయరా? అనుకున్నవాళ్లూ ఉన్నారు. అమ్మ మాకు ఒక స్ఫూర్తిగా, నాన్న ఓ శక్తిగా నిలబడ్డారు. అమ్మ ప్రోద్బలంతో, నాన్న ప్రోత్సాహంతో కెరీర్‌లో ముందుకు వెళ్లాను. నాన్న ఏది సాధించాలనుకున్నారో అన్నీ కలగలిపిన హీరోగా ఆది తయారయ్యాడు. నేను డాక్టర్‌ అవ్వాలనుకున్నాను.. ‘నేను అవుతాను’ అంటూ మా అమ్మాయి అయింది.

► ‘పోలీస్‌స్టోరీ’ సినిమా మంచి విజయం సాధించినందుకు నాన్నగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాను సాధించలేకపోయింది నేను సాధించానని సంతోషపడ్డారు. ఆ సినిమా 100డేస్‌ ఫంక్షన్‌లో వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నా నేను అమ్మ, నాన్న చేతుల మీదుగా షీల్డ్‌ తీసుకున్నాను. మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్‌ చూడటానికి వెళ్లినప్పుడు ఎవరైనా పెద్దవారు వస్తే మమ్మల్ని మేం కూర్చున్న సీట్ల నుంచి లేపి వేరే చోట కూర్చోమనేవారు. కానీ నాన్నగారు రిక్వెస్ట్‌ చేసి నన్ను, తమ్ముళ్లను అక్కడే కూర్చొనేలా చేసి తాను మరోచోట సినిమా చూసేవారు.

► సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, హీరోలకు అర్థం చేసుకునే భార్య దొరకాలి. నా అదృష్టం సురేఖ దొరికింది. అలాగే ఆదికి అరుణ. జ్యోతికి కృష్ణ ఫల్గుణ మంచి సపోర్టివ్‌. ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడితో నేను ఫుల్‌ హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ఏడాది నా 60వ పుట్టినరోజు రానుంది. నా మనవరాలు ఆద్యశ్రీకి యాక్టింగ్‌ అంటే ఆసక్తి. మనవడు ఇవాన్‌కు కార్‌ రేసింగ్‌ అంటే ఇష్టం. అలాగే ఆది కూతురు అయానా కూడా ఇంటెలిజెంట్‌ అమ్మాయి. యాక్ట్రస్‌ అవుతుందేమో చూడాలి. కానీ అయానాకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్‌ అని ఆది చెబుతుంటాడు.

► నాన్నగారికి ఉన్న చిన్న చిన్న కోరికల్లో కొన్నింటిని తీర్చగలిగాం. మరికొన్నింటిని తీర్చలేకపోయాం. అప్పట్లో స్థోమత లేదు. ఇప్పుడు ఉన్నా ఆయన మాకు దూరమైపోయారు. ఇక అమ్మ పాస్‌పోర్ట్‌ చూసి ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆమెను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేకపోయాను. 1993లో నేను అమెరికా వెళ్లాను. తనే అమెరికా వెళ్లినంత హ్యాపీ ఫీలయ్యారు నాన్నగారు. అప్పుడు నేను సురేఖకు రాసిన ఉత్తరం ఇంకా ఉంది. ‘‘నాతో పాటు అమ్మ, నాన్న, మన పిల్లలు, నువ్వు కూడా వస్తే బాగుండేది. భవిష్యత్తులో అందరం వద్దాం. ఎంజాయ్‌ చేద్దాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ తర్వాత అమ్మగారు చనిపోయారు. నాన్నగారు అప్పట్లో వచ్చే స్థితిలో లేరు. కానీ ‘శంకర్‌దాదా’ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇకపై ఆది, జ్యోతిర్మయి నేను చూడని ప్లేసెస్‌ను చూపించాలి మరి (నవ్వుతూ).

నాన్నకి వందకి వంద

– ఆది సాయికుమార్‌

► తాతగారిలా నాన్నగారు కూడా స్ట్రిక్టే. కానీ మరీ అంత స్ట్రిక్ట్‌ కాదు. ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు క్రికెట్‌ అంటే ఇష్టం. నాన్నగారు బాగా ప్రోత్సహించారు... స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారు ఫ్రెండ్లీగా ఉన్నా క్రికెట్, టెన్నిస్‌ టీమ్‌ల గురించి మాత్రం పోట్లాడుకుంటుంటాం (నవ్వుతూ). క్రికెట్‌ను చాలా మిస్‌ అవుతున్నాను. 2009లో వదిలేశాను.. ఆ తర్వాత సినిమాలవైపు వచ్చాను. కరోనా ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌లో మళ్లీ స్టార్ట్‌ చేశాను. నేను, ప్రజ్ఞా ఓఝా, అంబటి రాయుడు అండర్‌ 19 ఆడాం. క్రికెట్‌లో నేను ఆల్‌రౌండర్‌. క్రికెట్‌లో అప్పుడైతే ఇండియాకి ఆడాలి.. లేదంటే రంజీ, రైల్వేస్‌. ఇప్పుడు ఐపీఎల్‌ లాంటివి చాలా ప్లాట్‌ఫామ్స్‌ వచ్చాయి.. ఇప్పుడు అనిపిస్తుంటుంది.. అయ్యో అనవసరంగా వదిలేశానే అని.

► నా తొలి చిత్రం ‘ప్రేమకావాలి’ వంద రోజుల ఫంక్షన్‌లో నాన్న పక్కన నేనుంటాను.. తాతగారు నాకు ముద్దు పెడుతుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. నేను నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాన్నగారు ఫుల్‌ బిజీగా ఉండేవారు. ఆ సమయంలో నాకు, తాతగారికి మధ్య మంచి ర్యాపో ఉండేది. నాన్నకి నేను వందకి వంద మార్కులు వేస్తాను. మా నాన్న నుంచి నేను కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నా పిల్లలకి నేర్పాలి. నా కూతురికి నాన్నగారి పోలికలు వచ్చాయేమో. అందరూ కావాలనుకుంటుంది. ఎక్కువమంది ఉంటే సంతోషపడుతుంది.  

నాన్నకి వందకి నూటపది

– డాక్టర జ్యోతిర్మయి

► నేను డాక్టర్‌ అవ్వాలనే టాపిక్‌ ఇంట్లో నడుస్తుండేది. కానీ అసలు విషయం ఏంటంటే.. మా పెద్దవాళ్లు  ఆశించడానికన్నా ముందే నేను డాక్టర్‌ (జ్యోతిర్మయి పీడియాట్రీషియన్‌)ని కావాలనుకున్నాను. నిజానికి చిన్నప్పుడు నేను ఐదారేళ్లు సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాను. ‘బొంబాయి’ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్లకి డబ్బింగ్‌ చెప్పడానికి ఆడిషన్‌కి వెళ్లాను. అందులోని ‘కాఫీ కావాలా, టీ కావాలా? అని అమ్మ అడగమంది’ అనే డైలాగు ఎన్నిసార్లు ప్రాక్టీస్‌ చేసినా చెప్పలేదు. దీంతో ఎంపిక కాలేదు. మా బాబాయ్‌ ‘ఈశ్వర్‌’ సినిమాని ‘ఆయుధ’ పేరుతో తెలుగులో డబ్బింగ్‌ చేశాం. ఆ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఎత్తు ఎక్కువ అని తీసుకోలేదు. పాప పాత్రకు తెలుగు డబ్బింగ్‌ చెప్పాను. నా తొలి సినిమా అదే. ఆ సినిమాకి రూ.5000 పారితోషికం ఇచ్చారు. అంత చిన్న వయస్సులో అంత పెద్దగా సంపాదించానని చాలా కాలం చెప్పుకున్నాను.

► నాన్నగారు నాకంటే మా ఆయనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. మామ, అల్లుడిలా కాకుండా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక క్రికెట్‌ అంటే చాలు.. మా నాన్న సపోర్ట్‌ చేసిన టీమ్‌కి వ్యతిరేకంగా ఆది సపోర్ట్‌ చేస్తాడు. మా బాబాయిలు కూడా! వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అప్పుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పగిలిపోతాయో చెప్పలేం. నాన్నకి క్రికెట్‌ అంటే ఎంత ఇష్టం అంటే.. కృష్ణ ఫల్గుణతో నా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడే క్రికెట్‌ మ్యాచ్‌ చూశారు. అంత ఇష్టం నాన్నకి! నాన్నకి నేను వందకి 110 మార్కులు వేస్తాను. మా నాన్నగారి నుంచి పాజిటివిటీ నేర్చుకున్నాను. నా పిల్లలకీ నేర్పించాలనుకుంటున్నాను.


సాయికుమార్‌ తల్లితండ్రులు పీజే శర్మ, కృష్ణజ్యోతి


ఆది, అరుణ, సురేఖ, సాయికుమార్, జ్యోతిర్మయి, కృష్ణ ఫల్గుణ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement