PJ Sharma
-
ఫాదర్స్ డే స్పెషల్: సాయికుమార్ ఫ్యామిలీ వాయిస్!
‘‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’’... సాయికుమార్ కెరీర్‌కి తొలి బ్రేక్ అయిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రంలోని డైలాగ్ ఇది. సాయికుమార్ ఇంటి నాలుగు స్తంభాల్లో ముగ్గురు మన కళ్ల ముందు ఉన్నారు. కనిపించని నాలుగో స్తంభం పీజే శర్మ. ఈ మూడు స్తంభాల బలం ఆ నాలుగో స్తంభం. ఆ బలంతో సాయికుమార్ కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా సాయికుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ‘సాక్షి’తో చెప్పిన విశేషాల్లో కొన్ని... స్వరం నాన్నది.. సంస్కారం అమ్మది – సాయికుమార్ ► నా స్వరం నాన్న (ప్రముఖ నటుడు పీజే శర్మ) గారిది. సంస్కారం అమ్మ (కృష్ణజ్యోతి) ఇచ్చింది. ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అభిమానం ప్రేక్షకులందరిదీ. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఈ విషయంలో ఆది, జ్యోతిర్మయి చాలా లక్కీ (నవ్వుతూ). నాన్నగారి నుంచి నాకు, నా నుంచి నా పిల్లలు ఆది, జ్యోతిర్మయికి క్రమశిక్షణ అలవడింది. ► మా నాన్నగారు హీరో అవ్వాలనుకున్నారు. అమ్మకి హీరోయిన్ అవ్వాలని ఉండేది. కానీ అప్పట్లో ఉన్న పోటీ, వారి వ్యక్తిగత పరిస్థితుల వల్ల వారు ఊహించిన స్థాయిలో కుదర్లేదు. కుటుంబం కోసం అమ్మ త్యాగం చేయాల్సి వచ్చింది. పీజే శర్మ ఎంత కాలం ఇండస్ట్రీలో ఉంటారు.. మళ్లీ తిరిగి అగ్రహారం వచ్చి పౌరోహిత్యం చేయరా? అనుకున్నవాళ్లూ ఉన్నారు. అమ్మ మాకు ఒక స్ఫూర్తిగా, నాన్న ఓ శక్తిగా నిలబడ్డారు. అమ్మ ప్రోద్బలంతో, నాన్న ప్రోత్సాహంతో కెరీర్లో ముందుకు వెళ్లాను. నాన్న ఏది సాధించాలనుకున్నారో అన్నీ కలగలిపిన హీరోగా ఆది తయారయ్యాడు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను.. ‘నేను అవుతాను’ అంటూ మా అమ్మాయి అయింది. ► ‘పోలీస్‌స్టోరీ’ సినిమా మంచి విజయం సాధించినందుకు నాన్నగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాను సాధించలేకపోయింది నేను సాధించానని సంతోషపడ్డారు. ఆ సినిమా 100డేస్ ఫంక్షన్లో వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నా నేను అమ్మ, నాన్న చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్ చూడటానికి వెళ్లినప్పుడు ఎవరైనా పెద్దవారు వస్తే మమ్మల్ని మేం కూర్చున్న సీట్ల నుంచి లేపి వేరే చోట కూర్చోమనేవారు. కానీ నాన్నగారు రిక్వెస్ట్ చేసి నన్ను, తమ్ముళ్లను అక్కడే కూర్చొనేలా చేసి తాను మరోచోట సినిమా చూసేవారు. ► సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, హీరోలకు అర్థం చేసుకునే భార్య దొరకాలి. నా అదృష్టం సురేఖ దొరికింది. అలాగే ఆదికి అరుణ. జ్యోతికి కృష్ణ ఫల్గుణ మంచి సపోర్టివ్. ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడితో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ఏడాది నా 60వ పుట్టినరోజు రానుంది. నా మనవరాలు ఆద్యశ్రీకి యాక్టింగ్ అంటే ఆసక్తి. మనవడు ఇవాన్‌కు కార్ రేసింగ్ అంటే ఇష్టం. అలాగే ఆది కూతురు అయానా కూడా ఇంటెలిజెంట్ అమ్మాయి. యాక్ట్రస్ అవుతుందేమో చూడాలి. కానీ అయానాకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ అని ఆది చెబుతుంటాడు. ► నాన్నగారికి ఉన్న చిన్న చిన్న కోరికల్లో కొన్నింటిని తీర్చగలిగాం. మరికొన్నింటిని తీర్చలేకపోయాం. అప్పట్లో స్థోమత లేదు. ఇప్పుడు ఉన్నా ఆయన మాకు దూరమైపోయారు. ఇక అమ్మ పాస్‌పోర్ట్ చూసి ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆమెను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేకపోయాను. 1993లో నేను అమెరికా వెళ్లాను. తనే అమెరికా వెళ్లినంత హ్యాపీ ఫీలయ్యారు నాన్నగారు. అప్పుడు నేను సురేఖకు రాసిన ఉత్తరం ఇంకా ఉంది. ‘‘నాతో పాటు అమ్మ, నాన్న, మన పిల్లలు, నువ్వు కూడా వస్తే బాగుండేది. భవిష్యత్తులో అందరం వద్దాం. ఎంజాయ్ చేద్దాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ తర్వాత అమ్మగారు చనిపోయారు. నాన్నగారు అప్పట్లో వచ్చే స్థితిలో లేరు. కానీ ‘శంకర్‌దాదా’ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇకపై ఆది, జ్యోతిర్మయి నేను చూడని ప్లేసెస్‌ను చూపించాలి మరి (నవ్వుతూ). నాన్నకి వందకి వంద – ఆది సాయికుమార్ ► తాతగారిలా నాన్నగారు కూడా స్ట్రిక్టే. కానీ మరీ అంత స్ట్రిక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాన్నగారు బాగా ప్రోత్సహించారు... స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారు ఫ్రెండ్లీగా ఉన్నా క్రికెట్, టెన్నిస్ టీమ్‌ల గురించి మాత్రం పోట్లాడుకుంటుంటాం (నవ్వుతూ). క్రికెట్‌ను చాలా మిస్ అవుతున్నాను. 2009లో వదిలేశాను.. ఆ తర్వాత సినిమాలవైపు వచ్చాను. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో మళ్లీ స్టార్ట్ చేశాను. నేను, ప్రజ్ఞా ఓఝా, అంబటి రాయుడు అండర్ 19 ఆడాం. క్రికెట్లో నేను ఆల్‌రౌండర్. క్రికెట్లో అప్పుడైతే ఇండియాకి ఆడాలి.. లేదంటే రంజీ, రైల్వేస్. ఇప్పుడు ఐపీఎల్ లాంటివి చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి.. ఇప్పుడు అనిపిస్తుంటుంది.. అయ్యో అనవసరంగా వదిలేశానే అని. ► నా తొలి చిత్రం ‘ప్రేమకావాలి’ వంద రోజుల ఫంక్షన్లో నాన్న పక్కన నేనుంటాను.. తాతగారు నాకు ముద్దు పెడుతుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. నేను నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. ఆ సమయంలో నాకు, తాతగారికి మధ్య మంచి ర్యాపో ఉండేది. నాన్నకి నేను వందకి వంద మార్కులు వేస్తాను. మా నాన్న నుంచి నేను కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నా పిల్లలకి నేర్పాలి. నా కూతురికి నాన్నగారి పోలికలు వచ్చాయేమో. అందరూ కావాలనుకుంటుంది. ఎక్కువమంది ఉంటే సంతోషపడుతుంది. నాన్నకి వందకి నూటపది – డాక్టర జ్యోతిర్మయి ► నేను డాక్టర్ అవ్వాలనే టాపిక్ ఇంట్లో నడుస్తుండేది. కానీ అసలు విషయం ఏంటంటే.. మా పెద్దవాళ్లు ఆశించడానికన్నా ముందే నేను డాక్టర్ (జ్యోతిర్మయి పీడియాట్రీషియన్)ని కావాలనుకున్నాను. నిజానికి చిన్నప్పుడు నేను ఐదారేళ్లు సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. ‘బొంబాయి’ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్లకి డబ్బింగ్ చెప్పడానికి ఆడిషన్‌కి వెళ్లాను. అందులోని ‘కాఫీ కావాలా, టీ కావాలా? అని అమ్మ అడగమంది’ అనే డైలాగు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా చెప్పలేదు. దీంతో ఎంపిక కాలేదు. మా బాబాయ్ ‘ఈశ్వర్’ సినిమాని ‘ఆయుధ’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశాం. ఆ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఎత్తు ఎక్కువ అని తీసుకోలేదు. పాప పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాను. నా తొలి సినిమా అదే. ఆ సినిమాకి రూ.5000 పారితోషికం ఇచ్చారు. అంత చిన్న వయస్సులో అంత పెద్దగా సంపాదించానని చాలా కాలం చెప్పుకున్నాను. ► నాన్నగారు నాకంటే మా ఆయనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. మామ, అల్లుడిలా కాకుండా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక క్రికెట్ అంటే చాలు.. మా నాన్న సపోర్ట్ చేసిన టీమ్‌కి వ్యతిరేకంగా ఆది సపోర్ట్ చేస్తాడు. మా బాబాయిలు కూడా! వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పగిలిపోతాయో చెప్పలేం. నాన్నకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే.. కృష్ణ ఫల్గుణతో నా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడే క్రికెట్ మ్యాచ్ చూశారు. అంత ఇష్టం నాన్నకి! నాన్నకి నేను వందకి 110 మార్కులు వేస్తాను. మా నాన్నగారి నుంచి పాజిటివిటీ నేర్చుకున్నాను. నా పిల్లలకీ నేర్పించాలనుకుంటున్నాను. సాయికుమార్ తల్లితండ్రులు పీజే శర్మ, కృష్ణజ్యోతి ఆది, అరుణ, సురేఖ, సాయికుమార్, జ్యోతిర్మయి, కృష్ణ ఫల్గుణ -
పీజే శర్మ ఇక లేరు
* నటుడు, అనువాద కళాకారుడు పూడిపెద్ది జోగీశ్వర శర్మ * గుండెపోటుతో కన్నుమూత * తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 500కుపైగా చిత్రాల్లో నటన * వెయ్యి చిత్రాల్లో ప్రముఖ నటులకు గాత్రదానం సాక్షి, హైదరాబాద్/విజయనగరం: ప్రముఖ నటుడు, అనువాద కళాకారుడు, రచయిత పీజే శర్మ(82) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కళ్లేపల్లి రేగ గ్రామంలో జన్మించారాయన. నాటకాలపై అభిలాషతో పన్నెండేళ్ల వయసులోనే రంగస్థల ప్రవేశం చేసి.. తన 55ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 500కుపైగా చిత్రాల్లో నటించారు. సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, అమితాబ్‌లతో కలసి ఎన్నో సినిమాల్లో నటించిన ఘనత పీజే శర్మది. డబ్బింగ్ కళాకారునిగా పీజే శర్మది ఓ శకం. దాదాపు వెయ్యి చిత్రాల్లో ప్రముఖ నటులకు గాత్రదానం చేశారాయన. విజయనగరం జిల్లాలో షూటింగ్ జరిగిన కన్యాశుల్కం 34 ఎపిసోడ్ల సీరియల్లో ఆయన లుబ్ధావధానులుగా నటించారు. 1959లో విడుదలైన ఇల్లరికం చిత్రంతో నటునిగా చిత్రపరిశ్రమలో ప్రవేశించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ శర్మకు చివరి చిత్రం. మనవడు ఆది వివాహానికి హాజరుకాలేకపోయిన శర్మ శనివారం ఉదయం జరిగిన తన మనవడు, యువ హీరో ఆది వివాహానికీ అనారోగ్యం కారణంగా శర్మ రాలేకపోయారు. ఆ మరుసటి రోజే ఆయన గుండెపోటుతో మరణించారు. శర్మ మరణంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపింది. ప్రముఖుల సంతాపం.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, అశోక్‌కుమార్, మహర్షి రాఘవ, ఉత్తేజ్, ముత్యాల సుబ్బయ్య తదితరులు మణికొండ పంచవటి కాలనీలోని శ్రీసాయి అవెన్యూకు తరలివచ్చి శర్మ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కుమారుడు సాయికుమార్‌ను ఓదార్చారు. తండ్రి మరణంతో ఆయన ఎంతో కుంగిపోయి రోదిస్తూ కనిపించారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పీజే శర్మ అంతిమ సంస్కారం నిర్వహించారు. చంద్రబాబు సంతాపం పీజే శర్మ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. శర్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుమారులు.. ముగ్గురూ ముగ్గురే శర్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సాయికుమార్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించి డబ్బింగ్ రంగంలో ‘డైలాగ్ కింగ్’ అనిపించుకోగలిగారు. తర్వాత హీరోగా తెలుగు, కన్నడ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేరక్టర్ నటునిగా సాయికుమార్ బిజీ బిజీ. ఇక రెండో కుమారుడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్టుగా నంబర్‌వన్ అనిపించుకున్నారు. ‘బొమ్మాళీ రవిశంకర్’గా ఆయన ప్రాచుర్యమయ్యారు. మూడో కుమారుడు అయ్యప్ప పి.శర్మ దర్శకునిగా తెలుగులో ఈశ్వర్ అల్లా, హైదరాబాద్, కన్నడంలో వరదనాయక, వీరా చిత్రాలకు పనిచేశారు. పీజే శర్మ మనవడు, సాయికుమార్ తనయుడు ఆది... ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలోని యువహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. -
పీజే శర్మ విజయనగరం జిల్లా వాసే..
విజయనగరం కల్చరల్ : ఆయన గొంతు గంభీరం.. ఆయన సంభాషణలు చెబుతుంటే ఆ గొంతులో నవరసాలు అలవోకగా పలుకుతాయి.. అటువంటి గొంతు ఇప్పుడు మూగబోయింది. లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి-రేగ గ్రామానికి చెందిన పూడిపెద్ది జోగేశ్వరశర్మ (పీజే శర్మ) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. శర్మ స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి విజయనగరం మహారాజా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉండడంతో 12వ ఏటనే రంగస్థలంపై ప్రదర్శనలిచ్చారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే విజయనగరంలో నవ్యాంధ్ర నాటక కళాపరిషత్‌ను స్థాపించి ఎంతోమందిని నాటకరంగానికి పరిచ యం చేశారు. తర్వాత చిత్రసీమకు వెళ్లి మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసి తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎది గారు. తమిళ చిత్ర కథానాయకులు ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి నటులకు శర్మ డబ్బింగ్ చెప్పి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం నాటకంలో ఆయ న ధరించిన లుబ్ధావధానుల పాత్ర ఆయనకెంతో పేరు తెచ్చి పెట్టింది. ఆయన తొలిచిత్రం ఇల్లరికం కాగా చివరి చిత్ర నాగ. శర్మ మృతి తీరని లోటని పలువురు కళాభిమానులు, సాహితీ అభిమానులు అభిప్రాయపడ్డారు. పాత్రోచితమైన నటన శర్మ సొంతం పాత్రోచితమైన నటనకు పీజే శర్మ పెట్టింది పేరని సాహితీవేత్త డాక్టర్ ఎ.గోపాలరావు అన్నారు. స్థానిక కోట సమీపంలో సాయికుమార్, ఆది అభిమాన సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన శర్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఆయన మృతితో చిత్రసీమ మంచి నటుడ్ని కోల్పోయిందన్నారు. కళ్లేపల్లి -రేగలో విషాద ఛాయలు కళ్లేపల్లి-రేగ(లక్కవరపుకోట): ప్రముఖ సినీనటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ అకాల మరణంతో ఆయన సొంత గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన సహచరులు చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన సొంతింటిలో కొన్నాళ్లు బాలబడి నిర్వహించేవారని, ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలమైపోయిందని గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చి అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గ్రామానికి చెందిన మంధా శారదరావు, జెక్కాన కన్నబాబు, జెక్కాన బుచ్చిబాబు, తదితరులు తెలిపారు. -
పీజే శర్మ కన్నుమూత
-
పీజే శర్మ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి కుమార్ తండ్రి సీనియర్ నటుడు పీజే శర్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పీజే శర్మ అంత్యక్రియలు నిర్వహించారు. పీజే శర్మ ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చింది. మణికొండలోని ఆయన నివాసంలో 7.30 గంటలకు కన్నుమూశారు. పీజే శర్మ మృతికి రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. 1933, మే 24 వ తేదీన విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. నాటకాలపై మక్కువతో నాటకాలలో నటిస్తుండగా ...1954లో మొదటి సారిగా అన్నదాత చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. వందలాది డబ్బింగ్ సినిమాలలో డబ్బింగ్ చెప్పారు. 1966లో నటి కృష్ణజ్యోతిని పీజే శర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సాయికుమార్, రవి శంకర్, అయ్యప్ప పీ శర్మ, కుమార్తెలు కమల, ప్రియ. సాయి కుమార్ తనయుడు ఆది ప్రేమ కావాలి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆది వివాహం శనివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న పీజే శర్మ... అంతలోనే తుది శ్వాస విడవడంతో ఆయన ఇంటా విషాద ఛాయలు అలముకున్నాయి. -
పిజె శర్మ అంతిమయాత్ర పూర్తి!
-
సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతి
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి కుమార్ తండ్రి సీనియర్ నటుడు పీజే శర్మ ఆదివారం గుండెపోటుతో మరణించారు. మణికొండలోని ఆయన నివాసంలో పీజే శర్మకు తీవ్రమైన గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన ఉదయం 7.30 గంటలకు కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం 3.00 గంటలకు ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో పీజే శర్మ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సాయి కుమార్ కుమారుడు హీరో ఆది వివాహం శనివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న పీజే శర్మ... అంతలోనే తుది శ్వాస విడవడంతో ఆయన ఇంటా విషాద ఛాయలు అలముకున్నాయి. పీజే శర్మ మృతి పట్ల మా తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. 1933, మే 24 వ తేదీన విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. నాటకాలపై మక్కువతో నాటకాలలో నటిస్తుండగా ...1954లో మొదటి సారిగా అన్నదాత చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలాగే 1957లో ఉత్తమ ఇల్లాలు చిత్రంలోని పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, ప్రేమనజీర్ నటించిన చిత్రాలలో వారి పాత్రలకు పీజే శర్మ డబ్బింగ్ చెప్పారు. దాదాపు 150 చిత్రాలలో పీజే శర్మ నటించారు. అలాగే 500 సినిమాల వరకు ఆయన డబ్బింగ్ చెప్పారు. 1966లో నటి కృష్ణజ్యోతిని పీజే శర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సాయికుమార్, రవి శంకర్, అయ్యప్ప పీ శర్మ, కుమార్తెలు కమల, ప్రియ. సాయి కుమార్ తనయుడు ఆది ప్రేమ కావాలి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. -
నటుడు, సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతి