MLA defection
-
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేం (కోర్టులు) చేతులు కట్టుకొని కూర్చోవాలా?’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తమ ముందుకు వచ్చే దాకా పార్టీ మారిన ఎమ్మె ల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీ సులు జారీ చేయలేదని ప్రశ్నించింది. తొలి నోటీసు ఇచ్చేందుకు స్పీకర్‌కు 11 నెలలు ఎందుకు పట్టిందని నిలదీసింది. ‘ఒకవేళ కేసు మా ముందుకు రాకపోయి ఉండి ఉంటే మీరు (స్పీకర్) నాలుగేళ్లు కాలయాపన చేసేవాళ్లేమో?’ అంటూ చురకలు అంటించింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)తోపాటు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన రిట్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించగా స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. స్పీకర్ స్వతంత్రుడు... తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలదు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టుకు హైకోర్టులపై నియంత్రణ అధికారం లేదు. స్పీకర్ తన విధానాలకు స్వతంత్రుడు. కాబట్టి కోర్టు ఆదేశాలు ఇవ్వజాలదు’ అని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగ తీర్పులకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌కు చెప్పలేమా? అంటూ ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మేం అలా చేయకపోతే రాజ్యాంగ నిబంధనలను నిరాశ పరిచినవారమవుతాం. 2, 3, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకపోయినా ఆర్టికల్ 226 కింద ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం లేదని మీరెలా అంటారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని తాము స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే హైకోర్టులో పిటిషనర్లు పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు వేస్తూ వచ్చారని.. కనీసం స్పీకర్‌కు ఫిర్యాదును పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు. చర్యలకు ఉపక్రమించొచ్చు ముకుల్ రోహత్గీ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. 11 నెలలుగా స్పీకర్ ఫిరాయింపులపై స్పందించలేదు. మేం జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది. మేం స్పందించకపోతే ఇలాగే మరో నాలుగేళ్లు వేచి చూసేవాళ్లేమో?, స్పీకర్ జోక్యం చేసుకోకుంటే మేం ఇలాగే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచనట్లే. రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ‘సింగిల్ బెంచ్ కేవలం స్పీకర్‌ను నాలుగు వారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించాలని మాత్రమే అడిగింది. అలాంటప్పుడు అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు. కానీ రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు, అభ్యర్థనలను రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అయినా పాటించనప్పుడు.. వారిపై చర్యలు తీసుకొనే అధికారం ఉంటుంది. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు అభ్యర్థన రూపంలో తెలియపరుస్తాం. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే ఆర్టికల్ 142 ప్రకారం మా అధికారాలు ఉపయోగించి చర్యలకు ఉపక్రమిస్తాం. గతంలో మాకున్న అధికారాలతో ఓ స్పీకర్‌ను కోర్టుకు పిలిపించిన విషయాన్ని మర్చిపోవద్దు’ అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. ముకుల్ రోహత్గీ వాదనల అనంతరం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, ఎమ్మెల్యేల తరఫున రవిశంకర్ జంధ్యాల, ఎమెల్యేల తరఫున గౌరవ్ అగర్వాల్‌లు వాదనలను వినిపించారు. స్పీకర్, స్పీకర్ కార్యదర్శి తరఫున ముగ్గురు వాదనలను వినిపిస్తారా? ఏం చెప్పినా ఒకటే కదా మీ అందరూ చెప్పేది అంటూ జస్టిస్ గవాయి వారిని ఉద్దేశించి వ్యంగ్రా్రస్తాలు సంధించారు. సీఎం రేవంత్‌పై సుప్రీం ఆగ్రహం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పీకర్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అపహస్యం చేసినట్లే’ అని ధర్మాసనం మండిపడింది. అయితే తాను సీఎం తరఫున వాదనలను వినిపించట్లేదని.. అందువల్ల ఆ వ్యాఖ్యల గురించి వివరించలేకపోతున్నానని ముకుల్ రోహత్గీ బదులిచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ గతంలో అదే సీఎం తరఫున ఒక కేసులో హాజరైన విషయం మర్చిపోవద్దంటూ గుర్తుచేశారు. ‘రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చెప్పినప్పుడు దానికి కొంత పవిత్రత ఉంటుంది, ప్రజలు ఆ మాటలను విశ్వసిస్తారు. మేము కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయడంలో నెమ్మదిగా ఉండొచ్చు.. కానీ శక్తిలేనివారమైతే కాదు. కాబట్టి ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయొద్దని సీఎంకు చెప్పి హెచ్చరించండి’ అని ధర్మాసనం రోహత్గీకి సూచించింది. అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అనంతరం ఆర్యమా సుందరం రోహత్గీ, సింఘ్వీల వాదనలపై రిప్లై ఇవ్వనున్నారు. ఆర్టికల్ 142 ఏం చెబుతోందంటే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు విస్తృతాధికారాలు కల్పిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ ఉత్తర్వులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమలు చేసి తీరాల్సిందే. గతంలో ఈ ఆర్టికల్ మేరకు అధికారాలను వినియోగించి భోపాల్ గ్యాస్ లీక్ కేసులో పరిహారం అందించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు వైన్ షాపులు ఏర్పాటు చేయవద్దని.. ఇలా పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
నిర్ణయం స్పీకర్‌దే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఇచ్చిన అధికారాల మేరకు విధులు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో (రీజనబుల్ టైమ్) తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి..’ అని స్పష్టం చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తద్వారా స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోలేవని తేలి్చచెప్పింది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు ఇలా.. ‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎర్రబెల్లి దయాకర్ పిటిషన్లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది..’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. అయితే ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కాబట్టి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా నిరీ్ణత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ Ôనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.పలు తీర్పులు ప్రస్తావించిన ధర్మాసనం సెపె్టంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎస్ఏ సంపత్‌కుమార్ వర్సెస్ కాలే యాదయ్య, కీష మ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్, మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హో లోహన్ సహా పలు కేసుల్లో తీర్పులను శుక్రవారం తీర్పు వెల్లడి సందర్భంగా సీజే ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన(రీజనబుల్) సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ
అశ్వాపురం: కాంగ్రెస్ నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయించాలని పీఎం, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్, చీఫ్ సెక్రటరీకి, మొయినాబాద్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. మొయినాబాద్ పోలీసులు ఇచ్చే నివేదిక, తమ ఫిర్యాదు ఫైల్‌ను సీబీఐకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఒత్తిడికి లొంగి సీబీఐకి కేసు సమాచారం ఇవ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలతో పాటు పార్టీ ఫిరాయింపులే పనిగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీఎం, కేంద్ర హోం మంత్రి, సీబీఐ డైరెక్టర్‌కు లేఖలు రాయాలని కోరారు. లేదంటే కేసీఆర్‌తో వారు కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తుందన్నారు. -
పదవి సత్యం... పార్టీ మిథ్య!
అవును... పదవి సత్యం... పార్టీ మిథ్య. దక్కిన అధికారం సత్యం... ఆడినమాట మిథ్య. గోవా రాష్ట్ర ఎమెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్నేళ్ళుగా ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఇదే తంతు. బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోవడం అచ్చంగా అందుకు మరో ఉదాహరణ. గోవా సహా అనేక రాష్ట్రాల్లో కమలనాథులు సాగిస్తున్న అధికార అశ్వమేధంలో ఇది మరో అంకం. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని తమలో కలిపేసుకొని, కాషాయ జెండా కప్పడం ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నదే. గతంలో 2018లో అరుణాచల్ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్... ఇలా ప్రతి చోటా అనర్హత వేటుకు దొరక్కుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. మన రాజకీయ వ్యవస్థలోని లోపానికీ, ముందే తెలిసినా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ప్రతిపక్షాల అసమర్థతకూ పరాకాష్ఠ. చిన్న చిన్న నియోజకవర్గాల గోవాలో ఒక పార్టీకీ, సిద్ధాంతానికే కట్టుబడే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం కనిపించదు. కొద్ది వేల ఓట్లను చేతిలో పెట్టుకున్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో, ఇన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు ఛీ కొడతారనే భయమూ వారికి లేదు. ఇక ఆరునూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్న బీజేపీ అజెండా పుణ్యమా అని ‘ఆయా రామ్... గయా రామ్’ సంస్కృతి ఇటీవల ప్రబలింది. క్రితం అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారు. ఈసారి గెలిచి ఆరు నెలలైనా కాక ముందే అధికార విరహం భరించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు. తాజా గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచింది 11 మంది. వారిలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా 8 మంది వెళ్ళి బుధవారం బీజేపీలో చేరడంతో సాంకేతికంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. కానీ, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో దేవుడి ఎదుట పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? అదేమంటే, ‘గుడికి వెళ్ళి, దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను’ అంటూ హస్తం గుర్తుపై గెల్చిన దిగంబర్ కామత్ లాంటి వాళ్ళు నైతికమైన ఈ తప్పును సమర్థించుకోవడమే అమితాశ్చర్యం. ఢిల్లీ నుంచి ఏ దేవుడు చెబితే వీళ్ళు మారినట్టు? మారకపోతే జాగ్రత్తంటూ ఏ సీబీఐ, ఈడీల బెత్తం చూపి బెదిరిస్తే, మారినట్టు? ఆ దేవుడు ఏ వరాలు ప్రసాదిస్తే మారినట్టు? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలు. ప్యాకేజీలతోనో, పదవులతోనో, మాట వినకుంటే కేంద్ర సంస్థల దర్యాప్తులతోనో... ఎలాగైతేనేం ప్రతిపక్ష సభ్యుల్ని కంచె దాటి తమ వైపు వచ్చేలా చేసుకొనే కళలో కొన్నాళ్ళుగా ఆరితేరింది. బీజేపీ, దాని పెద్దలు అదే పనిగా ఇస్తున్న పిలుపు – ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’. కానీ, గత ఎనిమిదేళ్ళలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ‘ఆపరేషన్ కమలం’ చూస్తుంటే, ఎక్కడా ఏ ప్రతిపక్షమూ లేని ‘ప్రతిపక్ష ముక్త్ భారత్’ కాషాయ పార్టీ మనసులో కోరిక అని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ, అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏకపక్షంగా రాజ్యం చేయాలనుకోవడం వేరు. అప్పుడది ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యమైతే అనిపించుకోదు. వాజ్‌పేయి లాంటి నేతల హయాంలో కొన్ని విలువలకు పేరున్నపార్టీగా ఒకప్పుడు అందరూ అనుకున్న బీజేపీ దురదృష్టవశాత్తూ ఇప్పుడవన్నీ వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ప్రతిపక్షాల తప్పూ లేకపోలేదు. కమలనాథుల అధికారపు ఆకలి తెలిసీ, తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేక పోవడం పూర్తిగా ప్రతిపక్ష వైఫల్యమే. గోవాలో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ళు ఈ గట్టునే ఉంటారో చెప్పలేం. మాజీ సీఎం కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో – ఇద్దరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడక్కడ నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి, జూలైలోనే ఇదే కామత్ – లోబో జంట ఎమ్మెల్యేల మూకుమ్మడి వలసకు యత్నించింది. తీరా అంతా కలసి అయిదుగురే అవడంతో ఫిరాయింపుల నిరోధక వేటు పడుతుందని ఆఖరి నిమిషంలో అది ఆగింది. ఆ సంగతి తెలిసినా గత రెండు నెలల్లో ఈ ఎమ్మెల్యేల వేటను ఆపడంలో కాంగ్రెస్ విఫలమైంది. సంక్షోభ నివారణలో ఆ పార్టీ నేతల అసమర్థతకు ఇదో మచ్చుతునక. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి వారం తిరగక ముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగే కొద్దీ మరిన్ని దొంగదెబ్బలను కాంగ్రెస్ కాచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్‌లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బీజేపీ ఈసారి దృష్టి పెట్టవచ్చు. ఈ దుష్ట ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట ఎలా వేయాలన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజాప్రాతినిధ్య, ఫిరాయింపుల నిరోధక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లొసుగులను సరిదిద్దాలని పార్టీలన్నీ పట్టుబట్టాలి. పార్టీ మారే ప్రబుద్ధులను రీకాల్ చేసే అవకాశం లేనందున, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధిచెప్పాలనే చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంతా సమంజసమే అనుకొంటేనే కష్టం. ఏ గుర్తుపై గెలిచామన్నది కాదు.... ప్రభుత్వంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారైతే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకు మించిన అపహాస్యం మరొకటి లేదు. గోవా ఉదంతం మరోసారి గుర్తు చేస్తున్న సంగతి అదే! -
...గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్
గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్.. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక -
గోవా కాంగ్రెస్‌కు భారీ షాక్..
పనాజీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న వేళ గోవాలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద శేట్ తనవాడె సమక్షంలో బుధవారం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకి పడిపోయింది. బీజేపీ గూటికి చేరిన వారిలో దిగంబర్ కామత్, మైకేల్ లోబో, ఆయన భార్య డెలిహా లోబో, రాజేశ్ ఫల్దేశియా, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సెక్వెరియా, రూడల్ఫ్ ఫెర్నాండెజ్ ఉన్నారు. గోవా నుంచి ‘‘కాంగ్రెస్ ఛోడో, బీజేపీ కో జోడో’’’ప్రారంభమైందని ఫిరాయించిన ఎమ్మెల్యే లోబో వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచే ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ప్రచారం మొదలైంది. దిగంబర్ కామత్, లోబో, ఇతర నాయకులు సమావేశంలో బీజేపీలో చేరాలని తీర్మానించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక ఎమ్మెల్యేలు జారిపోకుండా రాహుల్ గాంధీ వారితో ఆలయం, చర్చి, మసీదుల్లో ప్రమాణాలు కూడా చేయించారు. చేసిన ప్రమాణాలను కూడా మరిచి పార్టీని మోసం చేశారని, ఇదో సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దీనిపై కామత్‌ను విలేకరులు ప్రశ్నించగా ‘‘బీజేపీలో చేరడానికి ముందు నేను మళ్లీ గుడికి వెళ్లి దేవుడా ఏం చెయ్యమంటాను అని అడిగాను. ఏది ఉత్తమమైన పనో అదే చెయ్యి అని ఆ భగవంతుడు చెప్పాడు’’అంటూ వెటకారంగా బదులిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో బీజేపీకి వణుకు పుడుతోందని అందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు దిగిందని విమర్శించారు. బీజేపీ చేస్తున్నది ‘‘ఆపరేషన్ కిచడ్ (బురద)’’అంటూ ట్విట్ చేశారు. రెండు నెలల క్రితమే లోబో నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నించడంతో కాంగ్రెస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. అసెంబ్లీలో శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న లోబోను తప్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలను లాగేసి బీజేపీ గట్టి దెబ్బ కొట్టింది. అసెంబ్లీ బలాబలాలు ఇలా.. ► 40 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో బీజేపీకి సొంతంగా 20 మంది సభ్యులున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. ► బీజేపీ ప్రభుత్వానికి ఇద్దరు సభ్యులున్న మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ (ఎంజీపీ) , ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ బలం 33కి పెరిగింది. ► కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది పార్టీ ఫిరాయించడంతో ముగ్గురు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. ► ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, రివల్యూషనరీ గోన్స్ పార్టీకి ఒక్కరు ఉన్నారు. ఇదీ చదవండి: Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో! -
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రండి
♦ దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి ♦ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బాలినేని సవాల్! ♦ 2019 నాటికి జిల్లాపై పార్టీ జెండా ఎగురవేద్దాం ♦ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేద్దాం ♦ ఒంగోలు సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిలుపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రజలు అభిమానించి ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా గెలిచారు... ఇప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేసి స్వార్థంతో పార్టీ ఫిరాయించారు... దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి... ప్రజాభిమానం ఎవరి వైపు ఉందో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన బాలినేని గురువారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. నగర శివారు నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో స్వాగత ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో బాలినేని ఉత్తేజభరిత ప్రసంగం చేశారు. నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో బాలినేని ప్రసంగిస్తూ.... ఇటీవల అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ గెలిచి అక్కడకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఏ మాత్రం పౌరుషం ఉన్నా రాజీనామా చేసి పోటీకి రావాలన్నారు. ప్రజాబలం ఎవరిదోనని తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన తాము ఆ రోజు రాజీనామా చేసి తిరిగి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయూంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి 13 స్థానాల్లో 11 స్థానాలను గెలిపించానన్నారు. జగన్ ఏడాది క్రితమే అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని చెప్పినా కొంతకాలం ఆగానని చెప్పారు. జగన్ సూచన మేరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అలంకరణ కోసం పార్టీ బాధ్యతలను చేపట్టలేదన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి అందరినీ కలుపుకొని పోతామన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. 8 నుంచి గడప గడపకూ.. జూలై 8 నుంచి ప్రారంభమయ్యే గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో నిర్వహిస్తానన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృ ష్టికి తీసుకురావాలన్నారు. ఇక నుండి జిల్లాలో ఉన్నన్ని నాళ్లు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. అందరి అండదండలతో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసి జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని బాలినేని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ యడం బాలాజి, కనిగిరి ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపి ఇన్చార్జ్ వరికూటి అశోక్‌బాబు, పర్చూరు ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్, అద్దంకి ఇన్చార్జ్ బాచిన చెంచుగరటయ్య, దర్శి ఇన్చార్జ్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మార్కాపురం మాజి ఎమ్మేల్యే కెపి కొండారెడ్డి, వరికూటి అమృతపాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రకాశాన్ని వెలిగిద్దాం: బాలినేని జిల్లా అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉంది. 6 మంది ఎమ్మెల్యేలుండగా.. నలుగురు పోయి, ఇద్దరమే మిగిలాం. అయినా భయం లేదు. - జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే 12 స్థానాల్లో విజయం ఖాయం: బాలినేని జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం సంతోషకరం. రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు కృషి చేస్తాం. - కె.పి.కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ప్రజాభిమానాన్ని డబ్బుతో కొనలేరు: ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయినా.. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ అభిమానాన్ని ఎవరూ కొనలేరు. - గొట్టిపాటి భరత్, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి సంతోషకరం: కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉన్న వాసన్న క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉంది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం మరింత సంతోషకరం. -బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి విజయమే ధ్యేయం: జిల్లాను ఏకతాటిపై నడిపించే సత్తా బాలినేనిది. అందరం ఆయనకు అండగా నిలబడతాం. వచ్చే ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పని చేద్దాం. - యడం బాలాజీ, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యేలు పార్టీ వీడి పోయినా కార్యకర్తలున్నారు. 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం. - చెంచు గరటయ్య, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి నేతలు అమ్ముడుపోయినా జనం మన వైపే: జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వాసన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం టీడీపీకి చెంపపెట్టు. టీడీపీ పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదు. - వరికూటి అశోక్‌బాబు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వాసన్న ఆదర్శంగా రాజకీయాల్లోకి: బాలినేనికి స్వాగత ర్యాలీ చూస్తే అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్లు ఉంది. వాసు ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చా. ఆయనకు అండగా ఉంటాం. - బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి విజయం మనదే: కొందరు ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయినా ప్రజలు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. - వెన్నా హనుమారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ ఆశయాలను నెరవేరుద్దాం: బాలినేని జిల్లా అధ్యక్షుడు కావడం సంతోషకరం. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి వైఎస్ ఆశయాలను నెరవేర్చాలి. - బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్టీ విజయానికి కృషి చేయూలి: బాలినేని జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడం సంతోషం. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరం కృషి చేయాలి. - గంగాడ సుజాత, జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్టీ బలోపేతం ఖాయం: బాలినేని నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడం ఖాయం. - కుప్పం ప్రసాద్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు