పనాజీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న వేళ గోవాలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద శేట్ తనవాడె సమక్షంలో బుధవారం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకి పడిపోయింది. బీజేపీ గూటికి చేరిన వారిలో దిగంబర్ కామత్, మైకేల్ లోబో, ఆయన భార్య డెలిహా లోబో, రాజేశ్ ఫల్‌దేశియా, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సెక్వెరియా, రూడల్ఫ్ ఫెర్నాండెజ్ ఉన్నారు.
గోవా నుంచి ‘‘కాంగ్రెస్ ఛోడో, బీజేపీ కో జోడో’’’ప్రారంభమైందని ఫిరాయించిన ఎమ్మెల్యే లోబో వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచే ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ప్రచారం మొదలైంది. దిగంబర్ కామత్, లోబో, ఇతర నాయకులు సమావేశంలో బీజేపీలో చేరాలని తీర్మానించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక ఎమ్మెల్యేలు జారిపోకుండా రాహుల్ గాంధీ వారితో ఆలయం, చర్చి, మసీదుల్లో ప్రమాణాలు కూడా చేయించారు. చేసిన ప్రమాణాలను కూడా మరిచి పార్టీని మోసం చేశారని, ఇదో సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దీనిపై కామత్‌ను విలేకరులు ప్రశ్నించగా ‘‘బీజేపీలో చేరడానికి ముందు నేను మళ్లీ గుడికి వెళ్లి దేవుడా ఏం చెయ్యమంటాను అని అడిగాను. ఏది ఉత్తమమైన పనో అదే చెయ్యి అని ఆ భగవంతుడు చెప్పాడు’’అంటూ వెటకారంగా బదులిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో బీజేపీకి వణుకు పుడుతోందని అందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు దిగిందని విమర్శించారు. బీజేపీ చేస్తున్నది ‘‘ఆపరేషన్ కిచడ్ (బురద)’’అంటూ ట్విట్ చేశారు. రెండు నెలల క్రితమే లోబో నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నించడంతో కాంగ్రెస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. అసెంబ్లీలో శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న లోబోను తప్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలను లాగేసి బీజేపీ గట్టి దెబ్బ కొట్టింది.
అసెంబ్లీ బలాబలాలు ఇలా..
► 40 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో బీజేపీకి సొంతంగా 20 మంది సభ్యులున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది.
► బీజేపీ ప్రభుత్వానికి ఇద్దరు సభ్యులున్న మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ (ఎంజీపీ) , ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ బలం 33కి పెరిగింది.
► కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది పార్టీ ఫిరాయించడంతో ముగ్గురు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీకి ఒక్క సభ్యుడు ఉన్నారు.
► ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, రివల్యూషనరీ గోన్స్ పార్టీకి ఒక్కరు ఉన్నారు.
ఇదీ చదవండి: Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో!
Comments
Please login to add a commentAdd a comment