goa congress party
-
పదవి సత్యం... పార్టీ మిథ్య!
అవును... పదవి సత్యం... పార్టీ మిథ్య. దక్కిన అధికారం సత్యం... ఆడినమాట మిథ్య. గోవా రాష్ట్ర ఎమెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్నేళ్ళుగా ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఇదే తంతు. బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోవడం అచ్చంగా అందుకు మరో ఉదాహరణ. గోవా సహా అనేక రాష్ట్రాల్లో కమలనాథులు సాగిస్తున్న అధికార అశ్వమేధంలో ఇది మరో అంకం. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని తమలో కలిపేసుకొని, కాషాయ జెండా కప్పడం ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నదే. గతంలో 2018లో అరుణాచల్ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్... ఇలా ప్రతి చోటా అనర్హత వేటుకు దొరక్కుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. మన రాజకీయ వ్యవస్థలోని లోపానికీ, ముందే తెలిసినా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ప్రతిపక్షాల అసమర్థతకూ పరాకాష్ఠ. చిన్న చిన్న నియోజకవర్గాల గోవాలో ఒక పార్టీకీ, సిద్ధాంతానికే కట్టుబడే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం కనిపించదు. కొద్ది వేల ఓట్లను చేతిలో పెట్టుకున్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో, ఇన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు ఛీ కొడతారనే భయమూ వారికి లేదు. ఇక ఆరునూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్న బీజేపీ అజెండా పుణ్యమా అని ‘ఆయా రామ్... గయా రామ్’ సంస్కృతి ఇటీవల ప్రబలింది. క్రితం అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారు. ఈసారి గెలిచి ఆరు నెలలైనా కాక ముందే అధికార విరహం భరించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు. తాజా గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచింది 11 మంది. వారిలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా 8 మంది వెళ్ళి బుధవారం బీజేపీలో చేరడంతో సాంకేతికంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. కానీ, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో దేవుడి ఎదుట పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? అదేమంటే, ‘గుడికి వెళ్ళి, దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను’ అంటూ హస్తం గుర్తుపై గెల్చిన దిగంబర్ కామత్ లాంటి వాళ్ళు నైతికమైన ఈ తప్పును సమర్థించుకోవడమే అమితాశ్చర్యం. ఢిల్లీ నుంచి ఏ దేవుడు చెబితే వీళ్ళు మారినట్టు? మారకపోతే జాగ్రత్తంటూ ఏ సీబీఐ, ఈడీల బెత్తం చూపి బెదిరిస్తే, మారినట్టు? ఆ దేవుడు ఏ వరాలు ప్రసాదిస్తే మారినట్టు? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలు. ప్యాకేజీలతోనో, పదవులతోనో, మాట వినకుంటే కేంద్ర సంస్థల దర్యాప్తులతోనో... ఎలాగైతేనేం ప్రతిపక్ష సభ్యుల్ని కంచె దాటి తమ వైపు వచ్చేలా చేసుకొనే కళలో కొన్నాళ్ళుగా ఆరితేరింది. బీజేపీ, దాని పెద్దలు అదే పనిగా ఇస్తున్న పిలుపు – ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’. కానీ, గత ఎనిమిదేళ్ళలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ‘ఆపరేషన్ కమలం’ చూస్తుంటే, ఎక్కడా ఏ ప్రతిపక్షమూ లేని ‘ప్రతిపక్ష ముక్త్ భారత్’ కాషాయ పార్టీ మనసులో కోరిక అని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ, అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏకపక్షంగా రాజ్యం చేయాలనుకోవడం వేరు. అప్పుడది ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యమైతే అనిపించుకోదు. వాజ్‌పేయి లాంటి నేతల హయాంలో కొన్ని విలువలకు పేరున్నపార్టీగా ఒకప్పుడు అందరూ అనుకున్న బీజేపీ దురదృష్టవశాత్తూ ఇప్పుడవన్నీ వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ప్రతిపక్షాల తప్పూ లేకపోలేదు. కమలనాథుల అధికారపు ఆకలి తెలిసీ, తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేక పోవడం పూర్తిగా ప్రతిపక్ష వైఫల్యమే. గోవాలో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ళు ఈ గట్టునే ఉంటారో చెప్పలేం. మాజీ సీఎం కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో – ఇద్దరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడక్కడ నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి, జూలైలోనే ఇదే కామత్ – లోబో జంట ఎమ్మెల్యేల మూకుమ్మడి వలసకు యత్నించింది. తీరా అంతా కలసి అయిదుగురే అవడంతో ఫిరాయింపుల నిరోధక వేటు పడుతుందని ఆఖరి నిమిషంలో అది ఆగింది. ఆ సంగతి తెలిసినా గత రెండు నెలల్లో ఈ ఎమ్మెల్యేల వేటను ఆపడంలో కాంగ్రెస్ విఫలమైంది. సంక్షోభ నివారణలో ఆ పార్టీ నేతల అసమర్థతకు ఇదో మచ్చుతునక. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి వారం తిరగక ముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగే కొద్దీ మరిన్ని దొంగదెబ్బలను కాంగ్రెస్ కాచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్‌లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బీజేపీ ఈసారి దృష్టి పెట్టవచ్చు. ఈ దుష్ట ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట ఎలా వేయాలన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజాప్రాతినిధ్య, ఫిరాయింపుల నిరోధక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లొసుగులను సరిదిద్దాలని పార్టీలన్నీ పట్టుబట్టాలి. పార్టీ మారే ప్రబుద్ధులను రీకాల్ చేసే అవకాశం లేనందున, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధిచెప్పాలనే చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంతా సమంజసమే అనుకొంటేనే కష్టం. ఏ గుర్తుపై గెలిచామన్నది కాదు.... ప్రభుత్వంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారైతే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకు మించిన అపహాస్యం మరొకటి లేదు. గోవా ఉదంతం మరోసారి గుర్తు చేస్తున్న సంగతి అదే! -
గోవా కాంగ్రెస్‌కు భారీ షాక్..
పనాజీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న వేళ గోవాలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద శేట్ తనవాడె సమక్షంలో బుధవారం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకి పడిపోయింది. బీజేపీ గూటికి చేరిన వారిలో దిగంబర్ కామత్, మైకేల్ లోబో, ఆయన భార్య డెలిహా లోబో, రాజేశ్ ఫల్దేశియా, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సెక్వెరియా, రూడల్ఫ్ ఫెర్నాండెజ్ ఉన్నారు. గోవా నుంచి ‘‘కాంగ్రెస్ ఛోడో, బీజేపీ కో జోడో’’’ప్రారంభమైందని ఫిరాయించిన ఎమ్మెల్యే లోబో వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచే ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ప్రచారం మొదలైంది. దిగంబర్ కామత్, లోబో, ఇతర నాయకులు సమావేశంలో బీజేపీలో చేరాలని తీర్మానించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక ఎమ్మెల్యేలు జారిపోకుండా రాహుల్ గాంధీ వారితో ఆలయం, చర్చి, మసీదుల్లో ప్రమాణాలు కూడా చేయించారు. చేసిన ప్రమాణాలను కూడా మరిచి పార్టీని మోసం చేశారని, ఇదో సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దీనిపై కామత్‌ను విలేకరులు ప్రశ్నించగా ‘‘బీజేపీలో చేరడానికి ముందు నేను మళ్లీ గుడికి వెళ్లి దేవుడా ఏం చెయ్యమంటాను అని అడిగాను. ఏది ఉత్తమమైన పనో అదే చెయ్యి అని ఆ భగవంతుడు చెప్పాడు’’అంటూ వెటకారంగా బదులిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో బీజేపీకి వణుకు పుడుతోందని అందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు దిగిందని విమర్శించారు. బీజేపీ చేస్తున్నది ‘‘ఆపరేషన్ కిచడ్ (బురద)’’అంటూ ట్విట్ చేశారు. రెండు నెలల క్రితమే లోబో నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నించడంతో కాంగ్రెస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. అసెంబ్లీలో శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న లోబోను తప్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలను లాగేసి బీజేపీ గట్టి దెబ్బ కొట్టింది. అసెంబ్లీ బలాబలాలు ఇలా.. ► 40 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో బీజేపీకి సొంతంగా 20 మంది సభ్యులున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. ► బీజేపీ ప్రభుత్వానికి ఇద్దరు సభ్యులున్న మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ (ఎంజీపీ) , ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ బలం 33కి పెరిగింది. ► కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది పార్టీ ఫిరాయించడంతో ముగ్గురు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన గోవా ఫార్వార్డ్ పార్టీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. ► ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, రివల్యూషనరీ గోన్స్ పార్టీకి ఒక్కరు ఉన్నారు. ఇదీ చదవండి: Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో! -
బీజేపీ ప్లాన్ సక్సెస్.. గోవాలో కాంగ్రెస్ ఖాళీ!
గోవాలో రాజకీయం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగింది. ప్రతిపక్షంలో ఉన్న 8 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కాగా, బీజేపీలో చేరిన వారీలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉండటం విశేషం. కాగా, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారి రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో, కాంగ్రెస్ శాసనసభాపక్షం బీజేపీలో విలీనమైంది. కాగా, ఇది కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ చోడో యాత్ర కొనసాగుతోందంటూ ఎద్దేవా చేశారు. Goa | 8 Congress MLAs including Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes join BJP in presence of CM Pramod Sawant pic.twitter.com/uxp7YaZAUN — ANI (@ANI) September 14, 2022 -
ప్రమోద్ జీ.. సీఎంగా మీకు బాధ్యత లేదా
పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సెప్టెంబర్ 2న(బుధవారం) కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉంటూ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు కరోనా సోకిందని.. అయినా రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించాల్సిన బాధ్యత తన మీద ఉందని స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రమోద్ సావంత్ తన విధులకు సంబంధించి కొన్ని ఫోటోలను శుక్రవారం విడుదల చేశారు. ఆ ఫోటోలో రాష్ట్రానికి సంబంధించిన కొన్నొ ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమోద్ సావంత్ తీరును ప్రతిపక్షం కాంగ్రెస్ తప్పుబట్టింది. ముఖ్యమంత్రి తన చేతులకు గ్లౌజ్ వేసుకోకుండానే ఫైళ్లపై సంతకాలు ఎలా చేస్తారని విమర్శించింది. (చదవండి : దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది) ఇదే విషయమై గోవా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదంకర్ ట్విటర్లో స్పందిస్తూ..' కరోనా సోకినా ప్రమోద్ సావంత్ విధులు నిర్వర్తించడం బాగానే ఉంది.. కానీ చేతికి కనీసం గ్లౌజ్ వేసుకొని సంతకాలు చేస్తే బాగుండేది.. ఆయన సంతకం చేసిన ఫైళ్లను అధికారులు, ఇతర సిబ్బంది ముట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి కరోనా సోకదని గ్యారంటీ ఏంటి.. ప్రమోద్ సావంత్ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది 'అంటూ చురకలంటించారు. -
మాదే పెద్ద పార్టీ.. మమల్ని ఆహ్వానించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్.. బీజేపీ అవసరాల మేరకు అనుగుణంగా పని చేయటం సరికాదంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న రూల్ రాజ్యాంగంలోనే ఉందని బీజేపీ చెబుతుండగా.. ఆ పాయింటే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. అనూహ్యంగా గోవా, బిహార్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలు తమవేనంటూ కాంగ్రెస్, ఆర్జేడీ లు తమకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాయి. గోవాలో కీలక పరిణామం... పానాజీ: గోవా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ‘అతిపెద్ద పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి’ అన్న లాజిక్ లేవనెత్తుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైపోయింది. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలతో రేపు(శుక్రవారం) రాజ్‌భవన్‌లో పేరేడ్‌కు సిద్ధమైపోయింది. హైకమాండ్ సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం గోవా కాంగ్రెస్ లెజిస్లేటివ్ భేటీ జరిగింది. అనంతరం సీఎల్పీ చంద్రకాంత్ కవ్లేకర్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు గవర్నర్ మృదులా సిన్హాను కలిసి ఎమ్మెల్యేల సంతకంతోపాటు కూడిన లేఖను సమర్పించబోతున్నాం. అవసరమైతే ఎమ్మెల్యేలతో పేరేడ్ కూడా నిర్వహిస్తాం. రూల్ ప్రకారం అతిపెద్ద పార్టీ మాదే. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ రద్దు చేసి, మాకు అవకాశం ఇవ్వాలని కోరతాం. కర్ణాటక పరిణామాలను చూశాక గోవా గవర్నర్ గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం’ అని చంద్రకాంత్ వెల్లడించారు. (గోవాలో ఏం జరిగిందో తెలుసా?) మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21 మాత్రం రాలేదు. దీంతో 14 సీట్లు వచ్చిన బీజేపీ.. గోవా ఫార్వర్డ్ పార్టీ-ఎంజీపీ-స్వతంత్ర్య అభ్యర్థుల(మొత్తం 9సీట్లు) సాయంతో కూటమిగా గోవాలో మారి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆర్జేడీ కూడా... పట్నా: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి తేజస్వి యాదవ్ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతోంది. ఆ లెక్కన్న బిహార్‌లో ఆర్జేడీనే అతిపెద్ద ప్రభుత్వం. మరి నితీశ్ కుమార్ సర్కార్‌ను రద్దు చేసి మమల్ని బిహార్ గవర్నర్ ఆహ్వానిస్తారా?’ అని తేజస్వి సెటైరిక్‌గా ఓ ట్వీట్ చేశారు. ఇక కర్ణాటక రాజకీయాలకు నిరసనగా ఆర్జేడీ గురువారం ఒక్కరోజు నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ‘దేశం మొత్తం బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. విభజన రాజకీయాలు, గవర్నర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయిస్తోంది. శుక్రవారం ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతాం. ఎందుకంటే మాదే పెద్ద పార్టీ కాబట్టి’ అని తేజస్వి మీడియాకు తెలిపారు. I will meet Honourable Governor of Bihar along with MLAs as we are single largest party of Bihar. — Tejashwi Yadav (@yadavtejashwi) 17 May 2018 2015లో ఆర్జేడీ-జేడీయూ కూటమి మహాఘట్భందన్ పేరిట ఎన్నికల్లో పాల్గొని 151 సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీకి 80 సీట్లు వచ్చి అతిపెద్దగా పార్టీగా ఆవిర్భవించగా.. జేడీయూ 71 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే కొంత కాలం తర్వాత జేడీయూ మహాఘట్భందన్ నుంచి బయటకు వచ్చి బీజేపీ(53 సీట్లు)తో దోస్తీ కట్టింది. -
గోవా కాంగ్రెస్‌లో చీలికలు
కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పొట్టు తీసిన నారింజపండులా ముక్కలుగా విడిపోతుందని బీజీపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఎప్పుడూ విమర్శించేవారు. ఇప్పుడు అధికారంలోకి రాకముందే గోవాలో కాంగ్రెస్ పార్టీ ముక్కలుగా విడిపోయి కొట్టుకుంటోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ పార్టీతో పెట్టుకోకూడదు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలా, ఎన్నికల తర్వత పొత్తు పెట్టుకోవాలా? లేదా ఒంటరిగానే పోటీచేయాలా? అన్న అంశాలపై పార్టీలోని నలుగురు నేతలు నాలుగు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకరి అభిప్రాయంతో ఒకరికి పొసగడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లూజిన్హో ఫాలిరో చిన్న చిన్న సర్దుబాట్లు మినహా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన దిగంబర్ కామత్ మాత్రం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), గోవా ఫార్వర్డ్ (జీఎఫ్), యునైటెడ్ గోవన్ పార్టీ (యూజీపీ)లతో ఎన్నికలకు పొత్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. కామత్‌కు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రతాప్ సింగ్ రాణె కుమారుడు, బలమైన యువజన నాయకుడు, ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన విశ్వజిత్ రాణెతోపాటు మరో ఎమ్మెల్యే రెగినాల్డ్ లారెంకో మద్దతు ఉంది. గోవా ఫార్వర్డ్ పార్టీతోనైనా ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని కామత్ డిమాండ్ చేస్తున్నారు. కామత్ డిమాండ్‌కు గోవా పార్టీ వ్యవహారాలకు బాధ్యుడిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ కూడా సానుకూలంగా ఉన్నారు. రాహుల్ గాంధీ విశ్వాసంలోకి తీసుకునే కొంతమంది సీనియర్లలో దిగ్విజయ్ సింగ్ ఒకరనే విషయం తెల్సిందే. మరోపక్క కామత్‌తో విభేదిస్తున్న ఫాలిరోకు సోనియా గాంధీ అండదండలున్నాయి. ఆయన ఇటీవలనే సోనియాను కలసుకొని వచ్చారు. సోనియా సూచన మేరకే ఆయన పార్టీ జాతీయ రాజకీయాల నుంచి పార్టీ రాష్ట్ర రాజకీయాలకు మారారు. ఫాలిరో ఇంతకుముందు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యనాయకులైన వీరిద్దరితో పాటు పార్టీలో మరో రెండు వర్గాలు కూడా పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నాయి. గోవాలోని 40 సీట్ల కోసం ఈరోజే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. 40 మందికిగాను ఇప్పటి వరకు 15 మందిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయగలిగింది. మిగతా అభ్యర్థుల విషయాల్లో నలుగురు మాజీ సీఎంలు, వారి బంధువుల మధ్య రాజీ కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, సోనియాల నేతృత్వంలో కేంద్ర పార్టీ ఎన్నికల సంఘం రంగప్రవేశం చేసి జాబితాను సిద్ధం చేయాలనుకుంటోంది. నేడో, రేపో ఈ ఎన్నికల సంఘం సమావేశం కానున్నట్లు సమాచారం. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కొల్లగొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత విభేదాలను సకాలంలో పరిష్కరించుకోకపోతే ప్రమాదమే. ఫిబ్రవరి నాలుగో తేదీన గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.