ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రండి | balineni challange to tdp leaders | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రండి

Published Fri, Jul 1 2016 3:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రండి

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రండి

దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బాలినేని సవాల్!
2019 నాటికి జిల్లాపై పార్టీ జెండా ఎగురవేద్దాం
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేద్దాం
ఒంగోలు సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిలుపు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రజలు అభిమానించి ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా గెలిచారు... ఇప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేసి స్వార్థంతో పార్టీ ఫిరాయించారు... దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి... ప్రజాభిమానం ఎవరి వైపు ఉందో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన బాలినేని గురువారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు.

నగర శివారు నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో స్వాగత ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో బాలినేని ఉత్తేజభరిత ప్రసంగం చేశారు. నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో బాలినేని ప్రసంగిస్తూ.... ఇటీవల అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ గెలిచి అక్కడకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఏ మాత్రం పౌరుషం ఉన్నా రాజీనామా చేసి పోటీకి రావాలన్నారు. ప్రజాబలం ఎవరిదోనని తేల్చుకుందామని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన తాము ఆ రోజు రాజీనామా చేసి తిరిగి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ హయూంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి 13 స్థానాల్లో 11 స్థానాలను గెలిపించానన్నారు. జగన్ ఏడాది క్రితమే అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని చెప్పినా కొంతకాలం ఆగానని చెప్పారు. జగన్ సూచన మేరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అలంకరణ కోసం పార్టీ బాధ్యతలను చేపట్టలేదన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి అందరినీ కలుపుకొని పోతామన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

 8 నుంచి గడప గడపకూ..
జూలై 8 నుంచి ప్రారంభమయ్యే గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో నిర్వహిస్తానన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృ ష్టికి తీసుకురావాలన్నారు. ఇక నుండి జిల్లాలో ఉన్నన్ని నాళ్లు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. అందరి అండదండలతో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసి జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని బాలినేని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ యడం బాలాజి, కనిగిరి ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపి ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు, పర్చూరు ఇన్‌చార్జ్ గొట్టిపాటి భరత్, అద్దంకి ఇన్‌చార్జ్ బాచిన చెంచుగరటయ్య, దర్శి ఇన్‌చార్జ్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మార్కాపురం మాజి ఎమ్మేల్యే కెపి కొండారెడ్డి, వరికూటి అమృతపాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశాన్ని వెలిగిద్దాం:  బాలినేని జిల్లా అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉంది. 6 మంది ఎమ్మెల్యేలుండగా.. నలుగురు పోయి, ఇద్దరమే మిగిలాం. అయినా భయం లేదు.  - జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే

 12 స్థానాల్లో విజయం ఖాయం: బాలినేని జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం సంతోషకరం. రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు కృషి చేస్తాం. - కె.పి.కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం

ప్రజాభిమానాన్ని డబ్బుతో కొనలేరు: ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయినా.. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ అభిమానాన్ని ఎవరూ కొనలేరు.
- గొట్టిపాటి భరత్, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి

 సంతోషకరం: కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉన్న వాసన్న క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉంది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం మరింత సంతోషకరం.  -బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి

విజయమే ధ్యేయం: జిల్లాను ఏకతాటిపై నడిపించే సత్తా బాలినేనిది. అందరం ఆయనకు అండగా నిలబడతాం. వచ్చే ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పని చేద్దాం. - యడం బాలాజీ, చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి

గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యేలు పార్టీ వీడి పోయినా కార్యకర్తలున్నారు. 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం.
- చెంచు గరటయ్య, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి

 నేతలు అమ్ముడుపోయినా జనం మన వైపే: జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వాసన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం టీడీపీకి చెంపపెట్టు. టీడీపీ పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదు. - వరికూటి అశోక్‌బాబు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి

వాసన్న ఆదర్శంగా రాజకీయాల్లోకి: బాలినేనికి స్వాగత ర్యాలీ చూస్తే అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్లు ఉంది. వాసు ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చా. ఆయనకు అండగా ఉంటాం. - బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి

విజయం మనదే: కొందరు ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. 
- వెన్నా హనుమారెడ్డి, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త

 వైఎస్ ఆశయాలను నెరవేరుద్దాం: బాలినేని జిల్లా అధ్యక్షుడు కావడం సంతోషకరం. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి వైఎస్ ఆశయాలను నెరవేర్చాలి.
- బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

పార్టీ విజయానికి కృషి చేయూలి: బాలినేని జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడం సంతోషం. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరం కృషి చేయాలి.
- గంగాడ సుజాత, జిల్లా మహిళా అధ్యక్షురాలు

 పార్టీ బలోపేతం ఖాయం: బాలినేని నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడం ఖాయం.   
- కుప్పం ప్రసాద్,   వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement