
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపివేయాలని పెద్దల సభ వేదికగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలి. అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయి. ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాహుల్ రేవంత్ రాజ్యాంగ నడుస్తుంది అని మండిపడ్డారాయన.
అంతకుముందు ఈ అంశంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ భూములను ఎవరికి ధారధత్తం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలోనూ తీర్పు చెప్పింది. కానీ, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వ భూములను రేవంత్ పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం జింకలను , నెమళ్లను చంపి భూములను నాశనం చేస్తుంది. రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మి.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. విద్యార్థులపై రేవంత్ ప్రభుత్వం పాశవిక చర్యలు మానుకోవాలి అని అన్నారు.
బీజేపీ ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రం ఆలోచిస్తుందన్న విషయం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు తెలియజేశారని, అలాంటి యూనివర్సిటీ భూములను అమ్మొద్దని తాము పోరాటం చేస్తామని అన్నారు.
