HCU agitations
-
‘రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మరోసారి మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్.‘ రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంతే. చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారు. హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే మీటింగ్‌ను ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నరు. ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్దమయ్యారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దించలేదు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ది మారలేదుఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నరు. హెచ్ సీయూ భూములపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధమా?, రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో ఉన్నది కేసీఆర్, రేవంత్ సర్కార్ కాదు. భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోదీ సర్కార్ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సిద్దమైతే హెచ్‌సీయూ భూ కుట్రదారుల భాగోతాన్ని బట్టబయలు చేస్తాం’ అని ధ్వజమెత్తారు బండి సంజయ్. -
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్ క్యూరీని రిట్ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది. -
కంచ గచ్చిబౌలి భూములు ఎవరూ కొనద్దు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీరు దారుణంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు ముందుకు పోతున్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో హెచ్‌సీయూ(HCU) భూముల ఆందోళనలపై కేటీఆర్ మాట్లాడారు. .. పేరుకే ప్రజా పాలన.. ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం విద్యార్థులు కొట్లాడుతున్నారు. విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు. ప్రజా పాలన అంటే విద్యార్థులపై దాడి చేయడమా?. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?. ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాల భూమి ఉండగా.. హెచ్‌సీయూలో ఉన్న ఆ 400 ఎకరాలే ఎందుకు?.ఆ 400 ఎకరాల భూముల్లోమూగజీవాలు కనిపించడం లేదా? అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు... ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములు ఎవరూ కొనొద్దు. ఆ భూమి ఎవరు కొన్నా నష్టపోతారు. మేం అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి తీసుకుంటాం. మేము వచ్చాక అతిపెద్ద ఎకోపార్క్ ఏర్పాటు చేస్తాం. అద్భుతంగా తీర్చిదిద్ది హెచ్‌సీయూకి కానుకగా ఇస్తాం’’ అని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవం చేపడితే.. అప్పుడు హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు. -
పార్లమెంట్‌కు చేరిన HCU భూముల వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపివేయాలని పెద్దల సభ వేదికగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలి. అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయి. ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాహుల్ రేవంత్ రాజ్యాంగ నడుస్తుంది అని మండిపడ్డారాయన.అంతకుముందు ఈ అంశంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ భూములను ఎవరికి ధారధత్తం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలోనూ తీర్పు చెప్పింది. కానీ, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వ భూములను రేవంత్ పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం జింకలను , నెమళ్లను చంపి భూములను నాశనం చేస్తుంది. రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మి.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. విద్యార్థులపై రేవంత్ ప్రభుత్వం పాశవిక చర్యలు మానుకోవాలి అని అన్నారు. బీజేపీ ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రం ఆలోచిస్తుందన్న విషయం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు తెలియజేశారని, అలాంటి యూనివర్సిటీ భూములను అమ్మొద్దని తాము పోరాటం చేస్తామని అన్నారు. -
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. -
ప్రధానితో మాట్లాడతా..
- హెచ్‌సీయూ వీసీ రీకాల్‌పై సభలో సీఎం కేసీఆర్ - రోహిత్ మరణం కలచివేసింది - వివక్షాపూరిత ఘటనలు క్షమార్హం కాదు.. వీసీ రీకాల్ అంశంపై తీర్మానం అనవసరం - ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నా - హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై నిష్పక్షపాత దర్యాప్తు.. - కన్హయ్య పర్యటనను అడ్డుకోవద్దని పోలీసులకు చెప్పా.. వర్సిటీ సిబ్బందే ఆయనను అడ్డుకున్నారు - ఓయూ ఘటనలో విద్యార్థులు ఆవేశానికి లోనయ్యారు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను రీకాల్ చేసే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్వయంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై వీలైతే రెండు మూడు రోజుల్లోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం శాంతి, సుహృద్భావాలను కోరుకుంటున్నదనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఇటీవల హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీల్లో జరిగిన ఘటనలపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ రెండు ఘటనల్లో పోలీసులు పరిధిని అతిక్రమించారని భావిస్తే... ఉన్నత స్థాయి అధికారితో నిష్పక్షపాత విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆ విచారణ నివేదికను సభ్యులకు ఇవ్వడంతో పాటు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలకు వెనుకాడబోదని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్ చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న విపక్ష సభ్యుల డిమాండ్‌ను సీఎం తిరస్కరించారు. ’‘అలా తీర్మానం చేయడం సభ స్థాయికి తగదు. తీర్మానం చేసేంత పెద్దమనిషి కాదు. వీసీ రీకాల్ అంశం మన పరిధిలోకి రాదు. ఈ అంశంపై చర్చ అనవసరం..’’ అని స్పష్టం చేశారు. చర్చ సందర్భంగా కొందరు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలతో రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉంటాయని.. వాటిని తొలగించి ముందుకు సాగుదామని సూచించారు. రోహిత్ ఆత్మహత్య కలచివేసింది విద్యార్థుల్లో యువరక్తం, భావోద్వేగాల వల్ల కొన్ని ఘటనలు జరుగుతాయని... దళిత, గిరిజన విద్యార్థుల పట్ల వివక్షాపూరిత ఘటనలు జరగడం క్షమార్హం కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రోహిత్ దళితుడా, కాదా అన్నది పక్కన పెడితే ఒక విద్యార్థి మరణించడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘‘రోహిత్ మరణిస్తే సీఎం వెళ్లలేదనే మాట నిజం. ఆ వార్త మమ్మల్ని కలచివేసింది. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని పంపడంతో పాటు గతంలో యూనివర్సిటీలో చదువుకున్న తెలంగాణ పూర్వ విద్యార్థుల ద్వారా విషయాలను తెలుసుకున్నాం. రోహిత్ చాలా తెలివైన విద్యార్థి. ఐఏఎస్, ఐపీఎస్ సాధించే సత్తా కలిగినవాడని తెలుసుకుని చాలా బాధపడ్డాం. అలాంటి ఘటనలు దేశానికి, రాష్ట్రానికి మంచి సంకేతాలు కావు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాహుల్, కేజ్రీవాల్ వంటి రాజకీయ నేతలు సందర్శించిన నేపథ్యంలో హెచ్సీయూకు వెళ్లాలా, వద్దా అనే మీమాంస ఎదుర్కొన్నామని, అలాగని తమకు బాధలేదని కాదని చెప్పారు. అలాంటి ఘటన జరగాల్సింది కాదని, ఏ సీఎం కూడా అలాంటి ఘటనలను కోరుకోరన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కన్హయ్యను అడ్డుకోవద్దని చెప్పా ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయనను అడ్డుకుని, అరెస్టు చేయొద్దని డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులకు సూచించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించేందుకు కన్హయ్య రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు. కొందరు తనను కూడా ఒత్తిళ్లకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ భావాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నందున కన్హయ్య పర్యటనకు సహకరించామన్నారు. అయితే కన్హయ్య హెచ్‌సీయూలోకి వెళ్లే క్రమంలో వీసీ ఆదేశాల మేరకు ఖాకీ దుస్తుల్లో ఉన్న వర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. వీసీ అప్పారావు విధుల్లో చేరడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని, ఆ సమయంలో పోలీసులు విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. మెస్, వాటర్, విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని, ఎవరైనా అతిగా ప్రవర్తించారని భావిస్తే విచారణ జరుపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలో వీసీల నియామకం సిద్ధాంతాల వైరుధ్యంతో గతంలో విద్యార్థుల మధ్య గొడవలు జరిగినా పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసేవారని... ప్రస్తుతం సిద్ధాంతాల పేరిట నిత్యం ఘర్షణ వాతావరణం సృష్టించడం సరికాదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పనిచేసిన కొందరు వీసీలు ఇష్టారీతిన ఉద్యోగ నియామకాలు జరిపారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో గ్రాంట్లు నిలిచిపోయాయని చెప్పారు. వ్యక్తి కేంద్రంగా కాకుండా, సంస్థ కేంద్రంగా పనిచేసే వ్యక్తులను వీసీలుగా నియమిస్తామని... ఇప్పటికే సెర్చ్ కమిటీ వేశామని, త్వరలోనే వీసీలను నియమిస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటనలో విద్యార్థులు ఆవేశానికి లోనయ్యారని.. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై జరిగిన దాడిని దురదృష్టకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని... కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క మెమొరాండం ఇచ్చారని చెప్పారు. ఆ ఘటనపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామన్నారు.