ఎవరో బిజినెస్‌మేన్‌ను పోటీ చేయిస్తారంట
రాజకీయాలంటే వ్యాపారమా?
వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స నామినేషన్ దాఖలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 580కి పైగా ఓట్ల బలం ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎవరో బిజినెస్‌మేన్‌ను తెచ్చి టీడీపీ పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతోందని, రాజకీయాలంటే ఆ పార్టీకి వ్యాపారంలా ఉందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. 300 ఓట్లకు పైగా తేడా ఉన్న సమయంలోనూ పోటీకి దిగడాన్ని ఎలా చూడాలని బొత్స ప్రశ్నించారు.
కూటమి గెలుస్తుందని చెప్పేవారు ఈ నెల 14 తర్వాత మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ తనుజారాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీకి పూర్తి బలం : సుబ్బారెడ్డి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయి బలం ఉందని.. అయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment