మీడియాతో చిట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు.
తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు.
ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.
సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్‌రెడ్డి బదులిచ్చారు.
ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు..
‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా.
ప్రధానిని ఒప్పించి మహబూబ్‌నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం.
రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్‌మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment