నకిలీ రాజకీయం.. ఈ మాట వినడానికి కొత్తగా ఉన్నా, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ఈ మాటను తెరపైకి తెస్తున్నాయి. తిమ్మినిబమ్మి చేయడంలో దిట్ట అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.
సాక్షి, అమరావతి : ప్రజా క్షేత్రంలో ప్రతికూల ఫలితాలు తప్పవనుకునే పార్టీలు.. నిజానికి ‘నకిలీ’ ముసుగేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. వాస్తవం ప్రజలకు తెలిసేలోగానే రాకెట్ వేగంతో అవాస్తవాలను తీసుకెళ్తున్నాయి. దీంతో ఓటేసి గెలిపించిన ప్రజలే గందరగోళంలో పడే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఈ తరహా ఎత్తుగడలను నెత్తికెత్తుకోవడంలో ముందు భాగాన నిలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కుప్పం సహా రాష్ట్రం మొత్తం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశానికి పరాభవం తప్పలేదు. వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలుపు గుర్రాలైతే.. తామే విజయ పథంలో దూసుకెళ్లామని టీడీపీ అంకెల గారడీ చేస్తోంది. పార్టీ రహిత.. ప్రజలిచ్చిన విజయాన్ని అధికార పార్టీ రుజువు చేసుకోవాల్సి వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి, గెలిచిన వాళ్ల ఫొటోలతో సచ్ఛీలతను చాటుకోవడం అనివార్యమైంది. విపక్షం అసత్యాలను తిప్పికొట్టామని ఊపిరి పీల్చుకునే లోపే వైఎస్సార్‌సీపీ వెబ్‌సైట్‌కు నకిలీ వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. అధికార పార్టీ విజయాన్ని తగ్గిస్తూ, టీడీపీ మెజారిటీ పెంచుతూ సాగిన ఈ నకిలీ ప్రచారం చూసి.. వైఎస్సార్‌సీపీకి పట్టం గట్టిన ప్రజలే విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రచారంలోనూ ‘నకిలీ’ పంథా!
ఎన్నికలకెళ్లే ఏ పార్టీకైనా సిద్ధాంతాలే ప్రాతిపదిక. చేసిన అభివృద్ధిని చెప్పుకుని అధికార పార్టీ.. పాలనలో లోపాలను ఎండగడుతూ విపక్షం ముందుకెళ్లడం సహజం. కానీ ఈసారి టీడీపీ విరుద్ధ వ్యూహాన్ని భుజానికెత్తుకుంది. రెండేళ్లుగా జనం వద్దకే జగన్ తన పాలన తీసుకెళ్లారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటెయ్యని వాళ్లూ ఆయన వైపే మళ్లారు. ఈ నేపథ్యంలో సుపరిపాలనపై విమర్శలు చేస్తే ప్రజలే ఎదురుదాడి చేస్తారని టీడీపీ గుర్తించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపేందుకు ఏ ఒక్క కారణం లేనందున, పక్కదారి పాలిటిక్స్‌కే టీడీపీ ప్రాధాన్యమిచ్చింది. తాను తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని వ్యవస్థలతో కుయుక్తులు చేశారనే ఆరోపణలు చంద్రబాబు మూటగట్టుకున్నారు. ఏడాది క్రితం ఆగిన స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన బెట్టి.. పంచాయతీ పోరు తెరమీదకు రావడం చంద్రబాబు ఎత్తుల్లో భాగమనే వాదనలూ విన్పించాయి.
గ్రామాల్లో వర్గాలు ఏర్పడితే అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలనే ఆయన వ్యూహం.. ప్రస్తుత ఫలితాలతో బెడిసి కొట్టిందనేది వాస్తవం. ఈ నిజం ప్రజలు గుర్తించేలోగానే అంతకాలం వెనకేసుకొచ్చిన ఎస్‌ఈసీపైనే ఆయన దండెత్తారు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిందని, ఎస్‌ఈసీ విఫలమైందని, కేంద్ర బలగాలు రావాలంటూ సరికొత్త నాటకం తెరమీదకు తెచ్చారు. పంచాయతీ ఎన్నికల పరాభవాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయన ముందే ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆఖరుకు సొంత గడ్డ కుప్పంలో ఓటమికి చంద్రబాబు చెప్పిన కారణాలు ఇలాగే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీని ఉత్సాహంగా గెలిపించిన ప్రజలకు.. ప్రజాస్వామ్యం ఓడిందనే కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. నిజానికి కుప్పం పరాభవం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. పార్టీ మనుగడే డోలాయమానంలో పడిందనేది టీడీపీ వర్గాల మాట. దీన్ని కప్పిపుచ్చుకునే రీతిలో చంద్రబాబు భ్రమలు కల్పించే ప్రయత్నం చేయడం గమనార్హం.
ఏమార్చడమే వ్యూహం
ప్రజా క్షేత్రానికి దగ్గరయ్యే వాళ్లనే ప్రజలు ఆదరిస్తారని వైఎస్ జగన్ ప్రతిసారి రుజువు చేస్తున్నారు. ఆ దిశగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడం అంటే ప్రస్తుతం ప్రయాసే. దీన్ని గుర్తించిన పార్టీలు అవాస్తవాలను రాకెట్ వేగంతో ప్రచారం చేస్తున్నాయి. చరిత్రలో సరికొత్తగా పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చిన చంద్రబాబు ఈ తరహా వ్యూహాన్నే అనుసరించారు. అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలనుకున్నారు. ఈ అబద్ధాలను ఎదుర్కోడానికి వైఎస్సార్‌సీపీ ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. అసత్యాలను తిప్పికొట్టడానికి విలువైన కాలాన్ని వెచ్చించాల్సి వచ్చింది. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ ఇదే తీరు కన్పించింది. కేంద్రానికి చెందిన దీన్ని రాష్ట్రం అమ్మలేదని తెలిసీ, వైఎస్ జగన్ అమ్మేస్తున్నారనే ప్రచారాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు.
పోస్కో ప్రతినిధుల భేటీ ఫొటోలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీనే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్.. విశాఖ ఉక్కును అమ్మేందుకు అంగీకరిస్తారా? అనే నిజం ప్రజలకు చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ శ్రమించాల్సి వచ్చింది. ప్రభుత్వ సంస్థలను గతంలో అమ్మేసిన చంద్రబాబు తీరును మరోసారి జనానికి తెలియజెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఏదేమైనా ప్రజలు జాగృతమయ్యారు. గత పాలన, ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమాన్ని గమనిస్తున్నారనేది వాస్తవం. తప్పుడు సంకేతాలు కాసేపు గందరగోళం సృష్టించినా, అంతిమంగా ప్రజలతో మమేకమయ్యే వారినే ప్రజలు దగ్గరకు తీస్తారని పంచాయతీ ఫలితాలే రుజువు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment