సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక వ్యూహం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కవ్వించి వీడియోలు తీస్తున్నట్లు స్పష్టమైంది. కొన్నిచోట్ల ఇలా వీడియోలు తీయడం వల్లే గొడవలు జరిగినట్లు గుర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల కదలికలను మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వీడియోలు తీయడంతో గొడవలు జరిగాయి. (ఓటమి భయంతో.. టీడీపీ దాడులు)
- నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీడియోలు తీసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురిని నియమించారు.
- వారు రోజంతా అక్కడే ఉండి ఆ కార్యాలయానికి వచ్చిపోయే వైఎస్సార్‌సీపీ నాయకులను వీడియో తీయాలని, చిన్నపాటి వాగ్వాదాలు, గొడవలు జరిగితే చిత్రీకరించి తమకు పంపాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సూచనలు వచ్చాయి.
- ఆ వీడియోలను ఎన్నికల కమిషనర్ ట్విట్టర్ ఎకౌంట్లో పెట్టి దాన్నే ఫిర్యాదుగా తీసుకోవాలని కోరాలని టీడీపీ నాయకత్వం పేర్కొంది.
- వీడియోలను అనుకూలంగా మలచుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయాలని టీడీపీ క్యాడర్‌కు సూచనలు అందినట్లు సమాచారం.
- టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వీడియోలు తీస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు.
- చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలను వీడియోలు తీస్తూ రెచ్చగొట్టడంతో గొడవ జరిగింది. ఈ ఘటనకు కొనసాగింపుగానే అదే నియోజకవర్గంలోని పులిచర్లలోనూ ఘర్షణ రేగింది.
- వీడియో తీయడం వల్లే పుంగనూరు నియోజకవర్గంలో గొడవ జరగ్గా, చంద్రబాబు ఆ గొడవనే పదేపదే ప్రస్తావించడం గమనార్హం.
- వీడియోలు తీస్తూ, కామెంట్లు చేస్తూ రెచ్చగొట్టడం, ఆ తర్వాత జరిగే గొడవలను వీడియోలు తీయడమే కొందరు పనిగా పెట్టుకున్నట్లు తెలిసింది.
- మాచర్లలోనూ టీడీపీ నాయకులు వీడియోలు తీసి హడావుడి చేయడం వల్లే గొడవ పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. (‘మద్యం, డబ్బుల పంపిణీ లేకుండా ఎన్నికలు’)
Comments
Please login to add a commentAdd a comment