జూన్‌లో లోకల్‌ వార్‌.. తెలంగాణ రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ | After the Lok Sabha elections local body elections in June 2024 | Sakshi
Sakshi News home page

జూన్‌లో లోకల్‌ వార్‌.. తెలంగాణ రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ

Apr 11 2024 1:00 AM | Updated on Apr 11 2024 1:02 AM

After the Lok Sabha elections local body elections in June 2024 - Sakshi

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో నల్లగొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు

లోక్‌సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు

గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు 

విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదన్న యోచనలో సీఎం రేవంత్‌! 

లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని భువనగిరి సమీక్షలో స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. 

మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది.. 
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పాలకవర్గాల పదవీకాలం     జనవరి నెలాఖరులోనే పూర్తికాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. జూలై తొలివారం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో జూన్‌ రెండో వారం నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఒకే దఫాలో పూర్తిచేయాలని సీఎం రేవంత్‌ యోచిస్తున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా పూర్తిచేయడం ద్వారా గ్రామ స్థాయిలోనూ రాజకీయంగా పట్టు సాధించడానికి, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్‌ నేతలతో సీఎం పేర్కొన్నట్టు సమాచారం. మధ్యమధ్యలో ఎన్నికలు వస్తూ ఉంటే ఇబ్బందులు వస్తుంటాయని చెప్పినట్టు తెలిసింది. రేవంత్‌ ఇచ్చిన సంకేతాల ప్రకారం.. జూన్‌ చివరి వారంలో లేదా జూలై తొలివారంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పనితీరు ఆధారంగా చాన్స్‌ 
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీపరంగా చూపిన పనితీరు ప్రాతిపదికనే.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యరి్థత్వాలతోపాటు ఇందిరమ్మ కమిటీల్లో సభ్యుల నియామకం చేపడతామని పార్టీ నేతలతో సీఎం రేవంత్‌ పేర్కొన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని.. ఇప్పటికే నామినేటెడ్‌ పదవుల నియామకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.  

రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ
అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వలంటీర్‌గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్‌ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement