జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల ఏర్పాటుకు బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ‘లోకల్ బాడీ’ఎలక్షన్స్ టార్గెట్‌గా పెట్టుకుంది, గ్రామస్థాయిలో సంస్థాగతంగా బలపడేందుకు కమలదళం సన్నద్ధమవుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల వ్యవస్థ పటిష్టానికి అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలు నిరాశ పరిచినా, లోక్‌సభ ఫలితాలు బీజేపీకి కొంతమేర ఊపునిచ్చాయి. గ్రామస్థాయిలో బీజేపీ అంత పటిష్టంగా లేదు.
ఈసారి జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలోనూ 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరాలని.. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ తీర్మానించింది, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ రాగా, లోక్‌సభ ఎన్నికల నాటికి 35 శాతానికి ఓటింగ్ పెరిగింది.
త్వరలో జరగబోయే లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఓటింగ్‌ను నిలుపుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో అన్నిస్థాయిల్లోని పార్టీ కేడర్‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇంతకాలం ఎంపీలు, ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసిన కార్యకర్తలను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రకటించారు.
స్థానికం.. సన్నద్ధం: పార్టీపరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ, వ్యూహాలు సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా 32 జిల్లాస్థాయి, మండలాల నుంచి, గ్రామ పంచాయతీల దాకా స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సామాజిక సమతూకం పాటిస్తూ.. ఓ ఓసీ, ఓ ఎస్సీ, ఓ బీసీ, ఓ మహిళ ఉండేలా కమిటీల కూర్పు ఉండనుంది. ఈ కమిటీలన్ని జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు పర్యటించి వార్డుసభ్యులు మొదలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తిస్తారు. పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు కూడా ఈ కమిటీలకే అప్పగించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment