సాక్షి, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు రానున్నాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ పార్టీలు స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికే మద్దతు ఇచ్చినట్లు వ్యవహరించినా.. ఓటు వేయకుండా పరోక్షంగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి సహకరించారా అన్న చర్చసాగుతోంది.
రాష్ట్రంలో జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదైంది. 77 మంది ఓటు వేయకపోగా, అందులో ఐదారుగురు మినహా మిగతా అందరూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత ప్రకటించింది.
బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయాలని తీర్మానించారు. కానీ ఇరు పార్టీల ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండి అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ తీరే వేరు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న సంఖ్యలో రెండో స్థానంలో ఆదిలాబాద్ డివిజన్ ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఓల్డ్ సమావేశ మందిరంలో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణికి పోలింగ్ ఏజెంట్‌గా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి వ్యవహరించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడు పాయల శరత్ శుక్రవారం పోలింగ్ కేంద్రం వద్ద పుష్పరాణి మద్దతుదారులైన తుడుందెబ్బ నాయకులతో చర్చిస్తూ బిజీబిజీగా కనిపించారు. పోలింగ్ మొదలైన తర్వాత ఉదయం నుంచి బీజేపీ సభ్యులను తీసుకువచ్చి పుష్పరాణికి ఓటు వేయించడంలో తోడ్పాటు అందించినట్లు ప్రత్యక్షంగా చూస్తున్నవారికి అనిపించింది.
తీరా పోలింగ్ ముగిసిన తర్వాత ఈ కేంద్రంలో 20 మంది ఓటు వేయలేదని, అందులో 13 మంది బీజేపీ సభ్యులు ఉన్నారని తేలడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. మున్సిపాలిటీలో ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం చర్చనీయంగా మారింది. వారు అలకబూనడంతోనే ఓటు వేయలేదనే ప్రచారం సాగుతోంది.
ఒకరోజు ముందు జిల్లా నాయకత్వం ఓటు ఎవరికి వేయాలనే అంశంపై చర్చించేందుకు పిలవగా వారు అందులో పాల్గొనలేదని అంటున్నారు. ప్రధానంగా ఒక ముఖ్య నేత ఈ ఎన్నికల పరంగా వ్యవహరించిన తీరుతోనే వారు అసంతృప్తికి లోనయ్యారని చెప్పుకుంటున్నారు. ఇది బీజేపీలో లుకలుకలకు దారితీస్తోంది.
కాంగ్రెస్‌ది వైరి వర్గం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైరి వర్గం మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పెందూర్ పుష్పరాణికి పార్టీ మద్దతు ఇస్తుందని నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థితో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు.
పోలింగ్ కేంద్రం వద్ద శుక్రవారం సాజిద్‌ఖాన్ పెందూర్ పుష్పరాణికి మద్దతుగా పార్టీ సభ్యులను ఓటు వేయాలని చెబుతూ కనిపించారు. అయితే కొన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధికార టీఆర్‌ఎస్ సభ్యులతో కలిసి రావడం చర్చనీయమైంది. మరోపక్క మంచిర్యాల, బెల్లంపల్లి పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ సభ్యులు 45 మంది ఓటు వేయకపోవడం గమనార్హం.
అక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశాలతోనే వారు ఓటు వేయలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే బెల్లంపల్లిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలిచిందా.. లేదా అనే అయోమయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment