‘స్థానికం’పై బీఆర్‌ఎస్ ఫోకస్
క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తూ..
ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా జనంలోకి... త్వరలో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీకి సన్నాహాలు
కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలపై త్వరలో స్పష్టత
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) ఆ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపాలనే గట్టి పట్టుదల బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.
ఆ మేరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను పెంచడం, నాయకులు, కేడర్ నడుమ సమన్వయం సాధించడం లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పదును పెడుతున్నారు.
త్వరలో రాష్ట్ర స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించాలనే యోచనలో ఉన్న కేసీఆర్ ఈ భేటీలోనే ఎన్నికల సన్నద్ధత దిశగా కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా పలువురు మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.
దసరా లోపే పార్టీ ప్లీనరీ!
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా భారీ సభలు నిర్వహించాలా లేక ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున బహిరంగ సభలు ఏర్పాటు చేయాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సుయాత్ర చేపట్టే అంశంపైనా కేసీఆర్ చర్చిస్తున్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన పార్టీ ప్లీనరీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. దసరా లోపు పార్టీ ప్లీనరీని రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశముంది. అయితే ఈ ప్లీనరీని హైదరాబాద్ బయట నిర్వహించాలనే సూచనలు కేసీఆర్‌కు అందుతున్నాయి. వరంగల్‌లో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశమున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఆ సెగ్మెంట్లలో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కేసీఆర్ దృష్టి సారించారు.
బాన్సువాడ, జగిత్యాల, పటాన్‌చెరు, చేవెళ్ల, గద్వాల సిర్పూరు, నిర్మల్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇన్‌చార్జీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సిర్పూరులో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఇప్పటికే కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు.
రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా
రాష్ట్రంలో రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాతో పాటు దళితబంధు, ఆసరా పింఛన్ల మొత్తం పెంపు తదితరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment