స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత నిబంధనల్లో సడలింపు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
జనాభా పెంపుదలకే ఈ మార్పులన్న మంత్రి నాదెండ్ల
సవరణ వల్ల సంతానోత్పత్తి పెరగదని, సంక్షేమ పథకాలు అందవన్న సభ్యులు
సాక్షి, అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ఆమోదించింది. ఒక బిల్లు వాయిదా పడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లు 2024 బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. గతంలో జరిగిన చట్ట సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయిందన్నారు.
మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. గతంలో ఆ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
జనాభా పెరగదు
ఈ బిల్లుపై అధికార కూటమి శాసన సభ్యులే పలువురు పెదవి విరిచారు. చట్ట సవరణ చేసినప్పటికీ, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంతానోత్పత్తి పెరగకపోవచ్చునని, పైగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఆలోచిస్తే ఈ సవరణ సంతానోత్పత్తి రేటు వృద్ధికి దోహద పడదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు.
జననీ సురక్ష పథకం ఒక్కరికే వర్తిస్తుందని, ఇద్దరు పుడితే ఆ పథకం వర్తించదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఉన్నన్ని రోజులూ సంతానోత్పత్తి రేటు పెరగదని స్పష్టం చేశారు. కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలైన రోజే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత పెరగడానికి ఈ సవరణ తోడ్పడుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి అన్నారు.
మరి కొన్ని బిల్లులకూ ఆమోదం
వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను శాసన సభ ఆమోదించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు మేరకు మూగ, చెవిటి, కుష్టు పదాలను తొలగిస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2024ను సభ ఆమోదించింది. ఆయా సమస్యలున్న వారికి విశ్వవిద్యాలయం ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి చెప్పారు. అ
దే విధంగా ఈ మూడు పదాలను తొలగిస్తూ ఏపీ ఆయుష్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లులనూ సభ ఆమోదించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు –2024కు కూడా సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్–2024ను మరో రోజుకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment