సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న వేళ గోవా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేసింది. వ్యాక్సిన్ ప్రక్రియ నేపథ్యంలో అధికారులంతా ఆ పనుల్లోనే నిమగ్నం అవుతారని, వారికి భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున ఏప్రిల్ తర్వాత భవిష్యత్ ప్రణాళిక వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎస్‌ఈసీ చోఖా రామ్‌గార్గ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 18న ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేసింది. దీంతో 11 మున్సిపల్ కౌన్సిళ్లు, పనాజి కార్పొరేషన్ సహా, వివిధ గ్రామపంచాయతీల్లోని ఉప ఎన్నికలు, దక్షిణ గోవాలోని నవేలిమ్ జిల్లా పంచాయతీ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల కమిషనర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేంత వరకు పాల్గొనమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి గోవా ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఎన్నికల సంఘం ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న ఆయన... ‘‘గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేశారు. వ్యాక్సినేషన్ సమయంలో అధికారులు నిమగ్నమై ఉంటారని కాబట్టి వారిపై అదనపు భారం వేయడం సరికాదు అని భావిస్తూ మూడు నెలలపాటు గోవా ఎన్నికల కమిషన్ ఎలక్షన్ వాయిదా వేసింది. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడే ఏపీ ఎన్నికల కమిషనర్ ఈ విషయం తెలుసుకుని అయినా మారతారని ఆశిస్తున్నాం. ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకా వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’’ అని వెంకట్రామిరెడ్డి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment