నేపాల్ ఆటగాళ్లు (ఫైల్ ఫొటో)
దుబాయ్ : అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలోకి మరో నాలుగు జట్లు వచ్చి చేరాయి. పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ జట్లను పాయింట్ల పట్టికలో చేర్చినట్లు ఐసీసీ శుక్రవారం తెలిపింది. రేటింగ్ పాయింట్లను లెక్కించే ముందు కొత్త జట్లు ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. వన్డే హోదా సాధించిన వాటిలో స్కాట్లాండ్ (28 పాయింట్లు) 13వ ర్యాంక్.. యూఏఈ(18పాయింట్లు) 14వ ర్యాంక్ సాధించింది. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువాత పాయింట్ల పట్టికలో పూర్తిస్థాయి ర్యాంకులను పొందనున్నాయి.
ఈ నాలుగు జట్లు వన్డే రేటింగ్ కలిగిన జట్లతో ఆడిన ప్రతి మ్యాచ్‌కు పాయింట్స్ కేటాయించారు. మే1,2015 నుంచి ఏప్రిల్ 30, 2017 వరుకు జరిగిన మ్యాచ్ 50 శాతం వెయిటేజ్ ఇవ్వగా.. మే 1,2017 అనంతరం జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఈ జట్లతో ఇప్పటికే తొలి 12 స్థానాల్లో ఉన్న జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ పేర్కొంది. గతేడాది నెదర్లాండ్స్ వన్డే హోదాను సాధించగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన స్కాట్లాండ్, యూఏఈలు తమ అంతర్జాతీయ వన్డే హోదాను కాపాడుకోగలిగాయి. క్వాలిఫయర్స్‌లో నేపాల్, పపువా న్యూగినియాపై గెలిచి అంతర్జాతీయ వన్డే జట్టు హోదాను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment