WC League 2: Scotland Players Refuse Shake Hands With Lamichhane - Sakshi
Sakshi News home page

బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు

Published Sat, Feb 18 2023 12:32 PM | Last Updated on Sat, Feb 18 2023 1:16 PM

WC League 2: Scotland Players Refuse Shake Hands With Lamichhane - Sakshi

ICC Cricket World Cup League Two 2019-23- Nepal won by 3 wkts: నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచానేకు ఘోర అవమానం జరిగింది. జట్టులోని ఇతర ప్లేయర్లతో కరచాలనం చేసిన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు.. కావాలనే సందీప్‌ను విస్మరించారు. అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా పక్కకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షం కాగా.. ‘‘తగిన శాస్తే జరిగింది. నీలాంటి వాళ్లకు ఇలాంటి ఘటనలు ఎదురైతేనన్నా కాస్త బుద్ధి వస్తుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2లో భాగంగా స్కాట్లాండ్‌, నమీబియా నేపాల్‌ పర్యటనకు వచ్చాయి. ఈ మూడు జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ జరగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆతిథ్య నేపాల్‌- పర్యాటక స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన నేపాల్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

మూడు వికెట్ల తేడాతో గెలుపు
లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు 47 ఓవర్లనే పని ముగించింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కుశాల్‌ మల్ల 81 పరుగులతో చెలరేగగా.. ఏడో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్‌ ఐరే 85 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నేపాల్‌ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ నేపథ్యంలో నేపాల్‌ జట్టును అభినందించే క్రమంలో స్కాట్లాండ్‌ ఆటగాళ్లు సందీప్‌ లమిచానేతో కరచాలనం చేసేందుకు విముఖత చూపారు. తమ చర్యతో సందీప్‌ పట్ల తమకున్న భావనను తెలియజేశారు.

ఇందుకు కారణం ఏమిటంటే..
నేపాల్‌ కెప్టెన్‌ సందీప్ గతేడాది అత్యాచార ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొ​న్నాళ్ల క్రితం బెయిల్‌ మీద విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం షరతులకు లోబడి నేపాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అతడిపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో ట్రై సిరీస్‌ ఆడేందుకు అనుమతినిచ్చింది.

అయితే, కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం రోహిత్‌ పౌడేల్‌కు అప్పగించింది. ఇక స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో రైట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ సందీప్‌ లమిచానే మూడు వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల యువ బౌలర్‌ 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన ప్రదర్శన (ఎకానమీ 2.70) కనబరిచాడు. అయితే, ఆటలో రాణించినా వ్యక్తిత్వంపై పడిన మచ్చ కారణంగా ఇలా అవమానం ఎదుర్కోకతప్పలేదతడికి!

హింసకు వ్యతిరేకంగానే
అంతకుముందు నమీబియా ఆటగాళ్లు కూడా సందీప్‌ పట్ల ఇలాగే వ్యవహరించారు. కాగా లింగ వివక్ష పూరిత హింసకు వ్యతిరేకంగా స్కాట్లాండ్‌, నమీబియా బోర్డుల సూచన మేరకే ఆటగాళ్లు ఈ మేరకు సందీప్‌తో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది. నేపాల్‌ బోర్డు సెలక్షన్‌తో తమకు పనిలేదని, అయితే, మహిళలపై హింసకు వ్యతిరేకంగా తమ స్పందన తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సందీప్‌నకు నేపాల్‌ బోర్డు ముందే చెప్పడంతో అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు ఈఎస్‌పీఎన్‌ తన కథనంలో పేర్కొంది.

చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌.. వీడియో వైరల్‌
IND vs AUS: ఇదేమి బాల్‌రా బాబు.. దెబ్బకు రోహిత్‌ శర్మ షాక్‌! వైరల్‌
Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్‌.. కానీ పాపం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement