సందీప్ లమిచానే (PC: CRICKETNEP X)
Sandeep Lamichhane sentenced: నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే జైలు పాలయ్యాడు. అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఎనిమిదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అదే విధంగా.. రూ. 3 లక్షల జరిమానా విధించడంతో పాటు.. బాధితురాలికి పరిహారం కింద రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఒకప్పటి కెప్టెన్
కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు
ఓవరాల్‌గా ఈ ఫార్మాట్లో 75 మ్యాచ్‌లలో కలిపి 158 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు సందీప్. ఇందులో మూడు ఫైవ్ వికెట్స్ హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్‌గా ప్రసిద్ధి పొందిన సందీప్ లమిచానే.. 2018-20 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ 23 ఏళ్ల స్పిన్నర్ 13 వికెట్లు తీశాడు.
అప్పట్లోనే అరెస్ట్
ఆటగాడిగా కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకునే సమయంలో అత్యాచార ఆరోపణలతో సెప్టెంబరు, 2022లో అరెస్టయ్యాడు. మూడు నెలల తర్వాత కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు.
శిక్షను తాజాగా ఖరారు చేసిన కోర్టు
అయితే, తాజాగా ఈ కేసు విచారణకు రాగా కాఠ్మండు జిల్లా కోర్టు సందీప్ లమిచానేకు ఎనిమిదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డిసెంబరు 29నాటి విచారణలో భాగంగా జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్ నేతృత్వంలోని ధర్మాసనం అతడిని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌తో పాటు బీబీఎల్, పీఎస్‌ఎల్, బీపీఎల్, సీపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో సందీప్ లమిచానే పాల్గొన్నాడు.
చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment