T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్‌ బౌలర్‌.. రషీద్‌ ఖాన్‌ తర్వాత..! | T20 World Cup BAN VS NEP: Sandeep Lamichhane Becomes 2nd Fastest Bowler To Take 100 T20I Wickets | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్‌ బౌలర్‌.. రషీద్‌ ఖాన్‌ తర్వాత..!

Published Mon, Jun 17 2024 3:18 PM | Last Updated on Mon, Jun 17 2024 3:21 PM

T20 World Cup BAN VS NEP: Sandeep Lamichhane Becomes 2nd Fastest Bowler To Take 100 T20I Wickets

నేపాల్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ సందీప్‌ లామిచ్చేన్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి నేపాల్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన రెండో వేగవంతమైన (మ్యాచ్‌ల పరంగా) బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (4-1-17-2) ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకేందుకు రషీద్‌ ఖాన్‌కు 53 మ్యాచ్‌లు అవసరం కాగా.. సందీప్‌ తన 54వ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మార్కును తాకిన బౌలర్ల జాబితాలో రషీద్‌, సందీప్‌ తర్వాత వనిందు హసరంగ (63), హరీస్‌ రౌఫ్‌ (71) ఉన్నారు.

బంగ్లాతో మ్యాచ్‌లో సందీప్‌ 100 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో పాటు మరో రికార్డు కూడా సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో వన్డే, టీ20ల్లో 100 వికెట్ల మార్కును అందుకున్న తొమ్మిదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (42 మ్యాచ్‌ల్లో) సాధించిన ఘనత సందీప్‌ పేరిటే ఉంది. సందీప్‌.. రషీద్‌ ఖాన్‌తో పాటు ఈ రికార్డును పంచుకున్నాడు.

2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సందీప్‌.. ఒక్క సౌతాఫ్రికా మినహా తాను ఆడిన ప్రతి దేశంపై వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం సందీప్‌ ఖాతాలో 112 వన్డే వికెట్లు (51 మ్యాచ్‌ల్లో), 100 టీ20 వికెట్లు (54 మ్యాచ​్‌ల్లో) ఉన్నాయి. సందీప్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అతను 13 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలవడంతో బంగ్లాదేశ్‌ గ్రూప్‌-డి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వని నేపాల్‌ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటై హోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement