నేపాలీల కొత్త సంవత్సరం మేష సంక్రమణం రోజున జరుగుతుంది. ఇదేరోజు కఠ్మాండు సమీపంలోని భక్తపూర్‌లో ‘బిస్కెట్ జాత్రా’ వేడుకలు జరుగుతాయి. నిజానికి ఈ జాతర పేరు ‘బిస్కా జాత్రా’ అయినా, కాలక్రమంలో ‘బిస్కెట్ జాత్రా’గా జనాల్లో స్థిరపడింది. భక్తపూర్‌లో ఏటా ఈ జాతర జరుపుకోవడం వెనుక ఒక స్థలపురాణగాథ ప్రచారంలో ఉంది.
ఒకానొక కాలంలో భక్తపూర్ ప్రాంతాన్ని లిచ్చవి వంశానికి చెందిన శివదేవ మహారాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంపై చుట్టుపక్కల అడవుల్లో ఉండే కిరాతులు తరచు దాడులు చేస్తుండేవారు. తన రాజ్యానికి కిరాతుల బెడద లేకుండా చేయాలని కోరుతూ శివదేవ మహారాజు వజ్రయోగినిని ప్రార్థించాడు. కిరాతుల పీడను శేఖర్ ఆచాజు అనే తాంత్రికుడు విరగడ చేయగలడని, అతడి సహాయం తీసుకోమని వజ్రయోగిని సలహా ఇచ్చింది. శివదేవ మహారాజు తన పరివారాన్ని వెంటతీసుకుని శేఖర్ ఆచాజును కలుసుకుని, తన సమస్యను వివరించాడు.
శేఖర్ ఆచాజు తన తాంత్రిక శక్తితో పులిగా మారిపోయాడు. తన శిష్యగణాన్ని కూడా పులులుగా మార్చాడు. పులుల గుంపు ఒక్కసారిగా మెరుపుదాడి చేయడంతో కిరాతుల దండు పటాపంచలై, పలాయనం చిత్తగించింది. శివదేవ మహారాజుకు కిరాతుల బెడద విరగడైంది. కిరాతులను తరిమికొట్టిన శేఖర్ ఆచాజును శివదేవ మహారాజు తన రాజ్యంలోని తిమి పట్టణానికి ఆహ్వానించి, సిందూరపు జల్లులతో ఘనస్వాగతం పలికాడు. ఈ సంఘటన తర్వాత శేఖర్ ఆచాజు శక్తి అతడి భార్య నరరూపకు తెలిసింది. తన ఎదుట ఒకసారి పాముగా మారి చూపించాలని కోరింది. శేఖర్ ఆచాజు ఆమె చేతికి కొన్ని వడ్లగింజలు ఇచ్చి, వాటిని తిరిగి తనపై చల్లితే యథారూపానికి వస్తానని చెప్పాడు. తన మంత్రశక్తితో కొండచిలువగా మారిపోయాడు. కొండచిలువను చూసి నరరూప భయంతో పరుగు తీసింది.
తన నడుముకు ఉన్న దట్టీ బిగుతుగా ఉండి అడ్డుపడటంతో దాన్ని వదులు చేసుకోవడానికి భర్త తన చేతికి ఇచ్చిన వడ్ల గింజలను నోట్లో వేసుకుంది. వెంటనే ఆమె కూడా కొండచిలువగా మారిపోయింది. తిరిగి మానవ రూపంలోకి రావాలంటే, ఆ రహస్యం శివదేవ మహారాజుకు మాత్రమే తెలుసు. కొండ చిలువలుగా ఉన్న భార్యా భర్తలిద్దరూ పాకుతూ రాజు అంతఃపురంలోకి వెళ్లారు. ఆచాజు దంపతులే అలా వచ్చారని పోల్చుకోలేని రాజు కొండచిలువలను చంపేయమని భటులను ఆజ్ఞాపించాడు.
భటులు వాటిని చంపేశారు. ఇది జరిగిన కొంతకాలానికి శివదేవ మహారాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. అప్పటి నుంచి పాముల రూపంలో మరణించిన ఆచాజు దంపతుల గౌరవార్థం ఏటా మేషసంక్రమణం రోజున ‘బిస్కా జాత్రా’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ జాతరలో భక్తపూర్ ప్రధాన వీథుల్లో భైరవుడిని, భద్రకాళిని రథాలపై ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని ‘థానే’ (ఎగువభాగం), ‘కోనే’ దిగువభాగం ప్రజల నడుమ పొడవాటి తాడును గుంజే ‘టగ్ ఆఫ్ వార్’ పోటీ జరుగుతుంది. మరుసటి రోజున ‘సిందూర్ జాత్రా’ జరుగుతుంది. జనాలు ఒకరిపై ఒకరు సిందూరం పూసుకుని, వీథుల్లోకి వచ్చి నృత్యగానాలతో సందడి చేస్తారు.
(చదవండి: పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment