తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ | Andhra players selected for Duleep Trophy Championship | Sakshi
Sakshi News home page

తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ

Published Mon, Aug 19 2024 7:53 AM | Last Updated on Mon, Aug 19 2024 9:14 AM

Andhra players selected for Duleep Trophy Championship

వచ్చే నెల 5 నుంచి దులీప్‌ ట్రోఫీ 

 అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టోర్నీకి ఆర్డీటీ స్టేడియం సర్వం సిద్ధం 

భారత జట్టులోని ముగ్గురు క్రీడాకారులు మినహా తక్కిన వారందరూ ప్రాతినిధ్యం  

సూర్యకుమార్‌ యాదవ్, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, పంత్‌ తదితర స్టార్‌ క్రికెటర్ల రాక 

పండుగ చేసుకోనున్న అభిమానులు

బ్యాటుతో రప్ఫాడేస్తారు. పరుగులతో హోరెత్తిస్తారు. కళ్లు చెదిరే సిక్సులు, ఫోర్లతో అలరించేస్తారు. ఎప్పుడూ టీవీలో కనిపించే అలాంటి తారలు మన నగరానికే వస్తున్నారు. వినోదం పంచనున్నారు. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా గ్రామం దేశవాళీ క్రీడా సంరంభానికి సిద్ధమవుతుండగా, తమ అభిమాన    క్రికెటర్ల రాక కోసం క్రికెట్‌ ప్రేమి కులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

అనంతపురం: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ పోటీలు అనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా, అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక మ్యాచ్‌ నాలుగు రోజుల పాటు (మల్టీడే మ్యాచ్‌) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే టెస్ట్‌ మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఒక మ్యాచ్‌ ఐదు రోజుల పాటు సాగుతుంది.  

క్రీడా గ్రామం ఖ్యాతి.. 
దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు తొలిసారిగా అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తుండడంతో జిల్లా పేరు దేశస్థాయిలో మార్మోగనుంది. 2003లో ప్రారంభించిన ఆర్డీటీ క్రీడా గ్రామం అనతి కాలంలోనే తన కీర్తిని ఇనుమడింపజేసుకుంది. స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలు పాటిస్తుండడంతో దులీప్‌ ట్రోఫీ నిర్వహణకు అవకాశం దక్కింది. పేద, మధ్య తరగతి క్రీడాకారులకు దన్నుగా నిలుస్తూ ఎంతో మంది ప్రతిభావంతులను క్రీడల వైపు ఆసక్తి పెరిగేలా కృషి చేసిన ఫాదర్‌ ఫెర్రర్‌ ఆశయం నెరవేరుతోందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

అభిమానులకు పండగే.. 
టోర్నీ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్, శుభ్‌మన్‌ గిల్, పంత్‌ తదితర క్రికెట్‌ స్టార్లు నగరానికి రానున్నారు. తమ ఆటతో అభిమానులను మురిపించనున్నారు. భారత జట్టు క్రికెటర్లలో ముగ్గురు మినహా అందరూ దులీప్‌ ట్రోఫీలోని జట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నగరంలోని రెండు త్రీ స్టార్‌ హోటళ్లలో భారత క్రికెటర్లకు బస ఏర్పాట్లు చేస్తున్నారు.

గర్వకారణం 
ఇలాంటి పెద్ద ఈవెంట్‌ జరగడం అనంతపురం జిల్లా చరిత్రలోనే తొలిసారి. ఇటువంటి మ్యాచ్‌లు జరుగుతాయని ఊహించలేదు. ఇంత మంది స్టార్‌ క్రికెటర్లు వస్తారని కలలో కూడా అనుకోలేదు. దులీప్‌ ట్రోఫీ వంటి వాటి నిర్వహణకు కేవలం గ్రౌండ్‌ ఒక్కటే సరిపోదు. క్రికెటర్లకు అధునాతన సౌకర్యాలు కల్పించాలి. ఇటువంటి టోర్నీల వల్ల జిల్లా క్రికెటర్లకు స్ఫూర్తి కలుగుతుంది. 

ఆర్డీటీ క్రీడా గ్రామంలో రెండు గ్రౌండ్లు ఉన్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. చాలా పెద్ద పని. చాలా ఏర్పాట్లు చేయాల్సి  ఉంటుంది. అందరి సహకారంతో ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేస్తాం. సెపె్టంబర్‌ 5 నుంచి 22 వరకూ టోర్నీ జరుగుతుంది. భారత జట్టులోని ముగ్గురు క్రీడాకారులు మినహా తక్కిన వారందరూ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  
– మాంఛో ఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ త్రీమెన్‌ కమిటీ మెంబర్‌  

దులీప్‌ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించే జట్లు ఇవే..
టీమ్‌–ఏ: శుభమన్‌ గిల్‌ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురెల్, కేఎల్‌ రాహుల్, తిలక్‌ వర్మ, శివమ్‌ ధూబే, తనుస్‌ కోటియన్, కులదీప్‌ యాదవ్, ఆకాష్‌ దీప్, ప్రసిద్‌్ధకృష్ణ, ఖలీల్‌ అహమ్మద్, అవేశ్‌ ఖాన్, విద్వత్‌ కావేరప్ప, కుమార్‌ కుషగ్ర, షస్వత్‌ రావత్‌. 

టీమ్‌–బీ: అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్, రిషబ్‌ పంత్, ముషీర్‌ ఖాన్, నితీష్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, యశ్‌ దయాల్, ముకేష్‌ కుమార్, రాహుల్‌ చహార్, ఆర్‌ సాయి కిశోర్, మోహిత్‌ అశ్విత్, ఎన్‌. జగదీషన్‌ (వికెట్‌ కీపర్‌) 

టీమ్‌–సీ: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌),  సాయి సుదర్శన్, రజత్‌ పటిదార్, అభిష్క్‌‌ పోరెల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్, బి.      ఇంద్రజిత్, హార్ధిక్‌ షోకీన్, మనవ్‌ సుతార్, ఉమ్రాన్‌ మాలిక్, వైశాఖ్‌ విజయ్‌కుమార్, అన్సుల్‌         కాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్‌     మార్ఖండే, ఆర్యన్‌ జుయాల్‌ (వికెట్‌ కీపర్‌),      సందీప్‌  వారియర్‌ 

టీమ్‌ –డీ: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అతర్వ టైడ్, యష్‌ దూబే, దేవదత్‌ పడిక్కల్, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రికీ భూయి, షరాన్స్‌ జైన్, ఆక్షర్‌ పటేల్, అర్షదీప్‌ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్‌ రాణా, తుషార్‌దేశ్‌పాండే, ఆకాష్‌ సేన్‌గుప్తా, కేఎస్‌. భరత్‌ (వికెట్‌ కీపర్‌), సౌరభ్‌ కుమార్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement