సాక్షి, అనంతపురం: నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఎమర్జింగ్ ఇండియా తరఫున ఆడిన అనూష బాగా రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్ అయిన అనూష 2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీలో చేరింది. అకాడమీ ప్రోత్సాహంతో జిల్లా, రాష్ట్ర, జోనల్ స్థాయిలో విశేషంగా రాణించి..చివరకు టీమిండియాలో చోటు దక్కించుకుంది. ఈమె తల్లిదండ్రులు బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి. సాధారణ రైతు కుటుంబం అయినప్పటికీ కుమార్తెను క్రికెటులో బాగా ప్రోత్సహించారు. ఆర్డీటీ సహాయ సహకారాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అనూష తెలిపింది.
(అనూషను అభినందిస్తున్న మాంఛూ ఫెర్రర్)
టీమిండియా తరఫున బాగా రాణించి దేశానికి పేరు తెస్తానంది. అనూష క్రీడాప్రస్తానం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడా ఆణిముత్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తోందని చెప్పారు.
కాగా, బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.
టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి.
వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment