వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. రెండ్రోజుల కిందట (జూన్ 22) యూఎస్‌ఏపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జూన్ 24) నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరపించింది. ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (75 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్స్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతనికి విక్రమ్‌జిత్ సింగ్ (30), బాస్ డి లీడ్ (41 నాటౌట్) సహకరించగా.. ఆంధ్ర క్రికెటర్ (విజయవాడలో పుట్టాడు) తేజ నిడమనూరు (2 నాటౌట్) నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
విజృంభించిన వాన్ బీక్.. కుప్పకూలిన నేపాల్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. వాన్ బీక్ (9.3-1-24-4), బాస్ డి లీడ్ (2/31), విక్రమ్‌జిత్ సింగ్ (2/20), క్లేటన్ ఫ్లాయిడ్ (1/31), ఆర్యన్ దత్ (8-2-23-1) ధాటికి 44.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చెలరేగిన మ్యాక్స్ ఓడౌడ్..
168 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (90) చెలరేగి ఆడాడు. ఓడౌడ్ దాదాపుగా ప్రతి నేపాల్ బౌలర్‌ను టార్గెట్ చేసి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఆఖర్లో బాస్ డి లీడ్ (39 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నెదర్లాండ్స్ కేవలం 27.1 ఓవర్లలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచ్చెన్ 2, గుల్సన్ ఝా ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment