వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్‌లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న విండీస్.. నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న డచ్ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది.
విండీస్ నిర్ధేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెదర్లాండ్స్‌ను ఆంధ్ర (విజయవాడ) ఆటగాడు తేజ నిడమనూరు తన విధ్వంసకర శతకంతో (76 బంతుల్లో 111; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టెక్కించగా (స్కోర్లు సమం చేసేంత వరకు తీసుకెళ్లాడు), అనంతరం సూపర్ ఓవర్‌లో లోగన్ వాన్ బీక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ (4,6,4,6,6,4) ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
శతక్కొట్టిన పూరన్.. రాణించిన బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), జాన్సన్ ఛార్లెస్ (54) అర్ధసెంచరీలతో రాణించారు.
తేజ నిడమనూరు వీరోచిత శతకం..
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. తేజ నిడమనూరు వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్‌ను సమం (374/9) చేయగలిగింది. తేజకు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
సూపర్ ఓవర్‌లో లోగన్ వాన్ బీక్ ఊచకోత.. బంతితోనూ మ్యాజిక్
సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ ఊచకోత కోశాడు. జేసన్ హోల్డర్ వేసిన ఆ ఓవర్‌లో వాన్ బీక్ వరుసగా 4,6,4,6,6,4 బాదాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ చేతులెత్తేసింది. బ్యాట్‌తో మెరిసిన వాన్ బీక్ బంతితోనూ మాయ చేశాడు.
తొలి బంతిని ఛార్లెస్ సిక్సర్ బాదగా.. రెండో బంతికి హోప్ ఓ పరుగు తీశాడు. అయితే ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్ బీక్.. ఛార్లెస్, హోల్డర్‌లను ఔట్ చేయడంతో విండీస్ కథ ముగిసింది. నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment