వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్ దశ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (జూన్ 26) జరిగే కీలక మ్యాచ్‌కు ఏకంగా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌నే దూరం పెట్టింది. అతనితో పాటు గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌ను కూడా పక్కన పెట్టింది.
రోవ్‌మన్ పావెల్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు పావెల్ స్థానంలో రొమారియో షెపర్డ్, కైల్‌మేయర్స్ స్థానంలో షమారా బ్రూక్స్‌ను తుది జట్టుకు ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (16), జాన్సన్ ఛార్లెస్ (27) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, విండీస్ ఇదివరకే సూపర్ సిక్స్‌కు చేరినా నెదర్లాండ్స్‌పై గెలుపు తదుపరి దశలో ఆ జట్టుకు కీలకం కానున్న నేపథ్యంలో విండీస్ మేనేజ్‌మెంట్ కీలక ఆటగాడిని తప్పించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే రెండు పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌కు చేరుతుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో ఈ పాయింట్లు ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాయి. మరోవైపు గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా ఉన్న జింబాబ్వే.. తమతో పాటు సూపర్ సిక్స్‌కు చేరుకున్న విండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించినందున 4 పాయింట్లు ఖాతా పెట్టుకుని సూపర్ సిక్స్‌కు చేరింది.
గ్రూప్-బి విషయానికొస్తే.. శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు (జూన్ 27) జరుగబోయే మ్యాచ్ అనంతరం ఏ జట్టు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుందో తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లు, ఓడిన జట్టు 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ దశలో ఈ పాయింట్లు కలుపుకుని ఒక్కో జట్టు 3 మ్యాచ్‌లు ఆడిన అనంతరం ఏ జట్లు టాప్-2లో ఉంటాయో అవి ఫైనల్‌లో తలపడటంతో పాటు ఈ ఏడాది చివరల్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment