వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది.
కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కార్ల్ హూపర్‌తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్‌ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్‌కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది.
ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్‌వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment