ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్‌ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్‌ కైవసం | Netherlands Secured A Thrilling Victory In Final Over Against Nepal In The Tri Series Final | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్‌ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్‌ కైవసం

Published Tue, Mar 5 2024 3:54 PM | Last Updated on Tue, Mar 5 2024 6:43 PM

Netherlands Secured A Thrilling Victory In Final Over Against Nepal In The Tri Series Final - Sakshi

నేపాల్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను నెదర్లాండ్స్‌ కైవసం​ చేసుకుంది. నేపాల్‌తో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు ఉ‍త్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో నెదర్లాండ్స్‌ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 

లోయర్‌ ఆర్డర్‌ ఆటగాడు టిమ్‌ వాన్‌ డర్‌ గుగ్టెన్‌ చివరి ఓవర్‌ రెండు, మూడు బంతులను వరుసగా బౌండరీ, సిక్సర్‌గా మలిచి నెదర్లాండ్స్‌ను గెలిపించాడు. గుగ్టెన్‌ మొత్తం 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

గుగ్టెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు ముందు సైబ్రాండ్‌ ఎంజెల్‌బ్రెచ్‌ సైతం బ్యాట్‌ ఝులిపించాడు. 18వ ఓవర్‌లో తొలి నాలుగు బంతులకు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన సైబ్రాండ్‌.. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నెదర్లాండ్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసిఫ్‌ షేక్‌ (47), గుల్సన్‌ ఝా (34), కుశాల్‌ మల్లా (26), రోహిత్‌ పౌడెల్‌ (25), కుశాల్‌ భుర్టెల్‌ (20) రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఫ్రెడ్‌ క్లాసెన్‌, గుగ్టెన్‌, మైఖేల్‌ లెవిట్‌, సైబ్రాండ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌.. లెవిట్‌ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సైబ్రాండ్‌ (48), గుగ్టెన్‌ (21 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ ఓడౌడ్‌ (22), విక్రమ్‌జిత్‌ సింగ్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నేపాల్‌ బౌలర్లలో కుశాల్‌ మల్లా 4 వికెట్లతో చెలరేగినప్పటికీ ప్రయోజనం​ లేకుండా పోయింది. ఈ సిరీస్‌లో నేపాల్‌, నెదర్లాండ్స్‌తో పాటు నమీబియా పాల్గొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement