న్యూజిలాండ్కు నేపాల్ షాక్
ఫతుల్లా: అండర్ -19 వరల్డ్ కప్ లో అండర్ డాగ్గా బరిలోకి దిగిన నేపాల్ సంచలన విజయం సాధించింది. గ్రూప్ డిలో భాగంగా గురువారం న్యూజిలాండ్ తో జరిగిన వన్డే లీగ్ మ్యాచ్ లో నేపాల్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేపాల్ విసిరిన 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.1ఓవర్లలో 206 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
న్యూజిలాండ్ ఆటగాళ్లలో గ్లెన్ ఫిలిప్స్(52), డేల్ ఫిలిప్స్(41), ఫిన్నీ(37)లు ఓ మోస్తరు రాణించగా, మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. నేపాల్ బౌలర్లలో ఏయిరీ మూడు వికెట్లు తీయగా, తమాంగ్ రెండు, ధామాలా, లామిచానీలకు తలో ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. సునార్(39), రిజాల్(48), ఆరిఫ్ షేక్(39), రజ్ బీర్ సింగ్(24), భూర్టేల్(35 నాటౌట్)లు ఫర్వాలేదనిపించడంతో నేపాల్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
గ్రూప్-బిలో జరిగిన ఇతర మ్యాచ్ ల్లో ఆఫ్ఘానిస్తాన్ పై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందగా, కెనడాపై శ్రీలంక 196 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.