
కరాచీ: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనను కొనియాడిన పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. తమ జట్టును మాత్రం దుమ్మెత్తిపోశాడు. అసలు ఆట ఎలా ఆడాలో, ఒత్తిడిని ఎలా అధిగమించాలో భారత యువ జట్టును చూసి నేర్చుకోవాలంటూ చురకలంటించాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రదర్శనపై అక్తర్ మండిపడ్డాడు. ప్రత్యేకంగా భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కొనియాడాడు. ఒక పానీపూరీ అమ్ముకుంటూ జట్టులో చోటు కోసం కష్టపడటమే కాకుండా కీలక సమయంలో తనలోని సత్తాను చాటి జట్టు నమ్మకాన్ని జైస్వాల్ నిలబెడితే, మీరంతా కలిసి ‘మేము ఇంతే’ అన్నట్లు ఏదో మొక్కుబడిగా ఆడేసి వచ్చారంటూ విమర్శించాడు. (ఇక్కడ చదవండి: పది వికెట్లతో పని పట్టారు)
ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని కూడా అక్తర్ వదిలి పెట్టలేదు. అండర్-19 వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుకు ఆ స్థాయి వరకూ మాత్రమే ఆడిన క్రికెటర్లతో కోచింగ్ ఇప్పిస్తారా అంటూ ధ్వజమెత్తాడు. పాకిస్తాన్‌లో ఎంతోమంది సీనియర్ క్రికెటర్లు ఉన్నా వారిని పట్టించుకోకుండా కింది స్థాయి కోచింగ్ ఇస్తే ఇలానే ఉంటుందంటూ ఎద్దేవా చేశాడు. ‘పాకిస్తాన్‌లో యూనస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు కదా. వారిద్దరూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సాయం అందించడానికి ముందుకొచ్చినా బోర్డు మాత్రం సుముఖంగా లేదు. ఇక్కడ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని చూసి నేర్చుకోండి. జూనియర్ స్థాయిలో వారి కోచింగ్ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. భారత్ క్రికెట్‌లో ద వాల్‌గా పిలవబడిన రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాడు అండర్-19, భారత్-‘ఎ’ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. చాలామంది క్రికెటర్లు ద్రవిడ్ శిక్షణలో రాటుదేలి ఇప్పుడు సత్తాను చాటుతున్నారు.
జూనియర్ స్థాయి నుంచి క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంతో పాటు వారికి సరైన కోచింగ్ ఇవ్వాలి. అప్పుడే జట్టు బలంగా మారుతుంది. మరి మనం ఎప్పుడూ ఒక ప్రతిభ ఉన్న సీనియర్ క్రికెటర్‌ను అండర్-19 స్థాయిలో కోచ్‌గా నియమించుకుందాం. పీసీబీ ఏదో జాబ్ ఉందంటే యూనిస్ ఖాన్ దరఖాస్తు చేసుకుని మీ వద్దకు వచ్చాడు. అప్పుడు మీరేం చేశారు. అతనితో బేరాలాడారు. అతను రూ. 15 లక్షలు అడిగితే, మీరు రూ. 13 లక్షలకే చేయమంటూ గీత గీసుకుని కూర్చుకున్నారు. ఇదేనా సీనియర్ క్రికెటర్లకు ఇచ్చే విలువ. ఇలాగే దిగ్గజ క్రికెటర్లను ట్రీట్ చేస్తారా. మీరు అండర్ 19 స్థాయి క్రికెట్ ఆడిన వారితో మాత్రమే కోచింగ్ ఇప్పిస్తామంటే మన రాతలు ఎప్పటికీ ఇంతే’ అంటూ అక్తర్ విమర్శలు గుప్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment