అండర్ 19 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీతో కదంతొక్కిన యువ భారత కెప్టెన్ యశ్ ధుల్(110 బంతుల్లో 110; 10 ఫోర్లు, సిక్స్).. అరుదైన ఘనతను సాధించాడు. ఈ విభాగపు వరల్డ్ కప్ టోర్నీల్లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్(2012)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. యాదృచ్చికంగా ఈ ముగ్గురు ఢిల్లీకి చెందిన వారే కావడం విశేషం.
కాగా, సెమీఫైనల్లో కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్(108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2016, 2018, 2020 సీజన్లలో కూడా యువ భారత్ తుది పోరుకు అర్హత సాధించి టైటిల్ ఫైట్‌లో నిలిచింది. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్ సారధ్యంలో తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన యువ భారత్.. 2008లో కోహ్లి నాయకత్వంలో, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా కెప్టెన్సీల్లో టైటిల్ సాధించింది.
ఇదిలా ఉంటే, ఆసీస్‌తో సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. భారత జట్టులో యష్ ధుల్, షేక్ రషీద్ మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారత యువ బౌలర్లలో విక్కీ వత్సల్ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
చదవండి: కోహ్లి వందో టెస్ట్ కోసం భారీ ఏర్పాట్లు.. కన‍్ఫర్మ్ చేసిన గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment