
అండర్ 19 ప్రపంచకప్ 2022లో యువ భారత జట్టును అద్భుతంగా ముందుండి నడిపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా రాణించి, టీమిండియా ఐదో ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన యశ్ ధుల్‌పై అతని వ్యక్తిగత కోచ్ రాజేశ్ నగార్ ప్రశంసల వర్షం కురిపించాడు. యశ్ ధుల్ సాధించిన ఈ ఘనత తనకెంతో గర్వకారణమని, కరీబియన్ దీవుల నుంచి అతని రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. జట్టును గెలిపించడం కోసం యశ్ ఆకలిగొన్న పులిలా ఉంటాడని, అతను కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్ సాధిస్తాడని తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ గెలిచిన అండర్ 19 జట్టు చాలా బలమైన జట్టు అని, ఈ జట్టుతో యశ్ అద్భుతాలు చేస్తాడని ముందే ఊహించానని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సందర్భంగా రాజేశ్ నగార్.. యశ్ ధుల్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. యశ్.. తన స్కూల్ డేస్ నుంచి విరాట్ కోహ్లికి వీరాభిమాని అని, కోహ్లి బ్యాటింగ్‌ను రెగ్యులర్ ఫాలో అవుతూ అమితంగా ఆరాధించేవాడని, విరాట్ లాంటి క్రికెటర్‌గా తయారవ్వడమే అతని లక్ష్యంగా ఉండేదని తెలిపాడు. కోహ్లిలా బ్యాటింగ్ చేయడం కోసం యశ్ ఎంతో కష్టపడ్డాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్ చూస్తే అచ్చం కోహ్లి బ్యాటింగ్ చూసినట్టే ఉంటుందని గర్వపడుతూ చెప్పుకొచ్చాడు. యశ్‌లో సమర్ధవంతమైన నాయకుడు కూడా ఉన్నాడని, అతని కెప్టెన్సీ స్టైల్ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని పోలి ఉంటుందని తెలిపాడు.
ఇదిలా ఉంటే, అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన యువ భారత జట్టు ఐదో ప్రపంచకప్ టైటిల్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని యంగ్ ఇండియా మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్(50), రాజ్ బవా(35) రాణించారు. అంతకుముందు టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment