అక్బర్ అలీ, ప్రియమ్ గార్గ్
నాలుగు సార్లు ఇప్పటికే విజేతగా నిలిచిన జట్టు ఒకవైపు... ఇంతకుముందు ఏ స్థాయిలో కూడా ప్రపంచకప్‌లో కనీసం ఫైనల్‌కు చేరుకోని జట్టు మరోవైపు... టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన రెండు టీమ్‌లు... ప్రస్తుతం బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలు... ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య అండర్–19 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే ఈ ఆసియా జట్ల పోరులో చాంపియన్ ఎవరనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది.
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): 16 యువ జట్లు పాల్గొన్న అండర్–19 ప్రపంచ కప్ తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో తొలిసారి ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ తలపడనుంది. తమ టైటిల్ నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
పోటాపోటీ...
లీగ్ దశలో ఇరు జట్లూ అజేయంగా నిలిచాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లను భారత్ ఓడిస్తే... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తే బంగ్లా జట్టు నుంచి తన్‌జీద్ హసన్ బ్యాటింగ్‌లో చెలరేగుతున్నాడు. కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రాలతో మన పేస్ దళం పదునుగా కనిపిస్తుంటే అటువైపు నుంచి తన్‌జీమ్ హసన్, షరీఫుల్ ఇస్లామ్ తమ పేస్ పదును చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వికెట్ల పండగ చేసుకున్న భారత లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి పోటీగా రకీబుల్ హసన్ తన స్పిన్‌తో ప్రత్యర్థి ని పడగొట్టాలని భావిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయం. రెండు జట్లు కూడా మార్పుల్లేకుండా సెమీస్‌లో ఆడిన టీమ్‌లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
►2018 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు భారత్ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
►గత ప్రపంచ కప్ తర్వాత భారత్, బంగ్లాదేశ్ జట్లు అండర్–19 విభాగంలో 7 సార్లు తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచ్‌లు వర్షంతో రద్దు కాగా... మిగిలిన ఐదు మ్యాచ్‌లలో 4 గెలిచిన భారత్ 4–1తో ఆధిక్యంలో ఉంది. 2018 ఆసియా కప్ సెమీఫైనల్లో, 2019 ఆసియా కప్ ఫైనల్లో భారత్‌నే విజయం వరించింది. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన పోరులో బంగ్లాదేశ్ 2 వికెట్లతో భారత్‌ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment