
అండర్-19 వరల్డ్‌కప్‌లో అజేయంగా సాగిన యువభారత్ ఆట అంతిమంగా పరాజయంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో నెగ్గి కప్‌ను తొలిసారి గెలిచి కొత్త చాంపియన్‌గా అవతరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో మరపురాని విజయంగా టైటిల్ పోరు నిలిచిపోతుంది. ఓటమి అంచున నిలిచిన జట్టును బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ పట్టుదలతో ఆడి విజయం వైపుగా నడిపించాడు. అయితే అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన అక్బర్ అలీ పరిస్థితి తెలిస్తే మాత్రం ఎవరైనా కాసింత ఉద్వేగానికి లోనుకాక మానరు. ఎందుకంటే.. టోర్నీ జరుగుతుండగానే అతడి సోదరి ఖదీజా ఖాతూన్ కవల పిల్లలకు జన్మనిచ్చే క్రమంలో ఆమె కన్నుమూసింది.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ను చూసిన ఆమె, ఆ తర్వాత ప్రసవం సందర్భంగా అనారోగ్యానికి గురై చనిపోయింది. అయితే సోదరి చనిపోయిన విషయం అక్బర్ అలీకి వెంటనే తెలియలేదు. ఇతరుల ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న అక్బర్ అలీ దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్బర్ తన సోదరి చాలా క్లోజ్‌గా ఉండేవాడు. ఆమె కూడా అక్బర్ పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. తొలుత అతనికి ఈ విషయం చెప్పొద్దు అనుకున్నాం. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం అక్బర్ తన సోదరుడికి ఫోన్ చేసి నిలదీశాడు. ఎందుకు చెప్పలేదని చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడటానికి నాకు ధైర్యం చాలలేదు అంటూ అతడి తండ్రి మీడియాకు వివరించాడు.