
భారత యువ ఆటగాళ్లు మరోసారి అదరగొట్టారు. న్యూజిలాండ్‌లో జరుగుతున్నఅండర్ -19 ప్రపంచకప్‌లో మరో విజయాన్ని అందుకున్నారు. రెండు రోజుల క్రితం పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా వెన్ను విరిచిన యువ బౌలర్లు, మరోసారి చెలరేగిపోయారు. క్రికెట్‌లో పసికూన పాపువా న్యూ గినియాను ఈసారి స్పిన్‌తో తిప్పేశారు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి వరుసగా రెండో విజయాన్ని అందుకున్నారు.
ఫలితంగా పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు అండర్ 19 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి భారత్.. పాపువా న్యూ గినియాను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలింగ్ ముందు ప్రత్యర్థి జట్టు తేలిపోయింది. ఏదశలోను పోటి ఇవ్వలేక పోయింది. యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ మెరవడంతో అతి తక్కువ పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 21.5 ఓవర్లలో 64పరుగులకే ఆలౌటైంది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ తన బౌలింగ్‌తో న్యూగినియాకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్‌లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్‌కోటి, అర్షదీప్‌సింగ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్వల్పలక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కెప్టెన్ పృథ్వీ షా అర్ద సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. మరో బ్యాట్‌మెన్ మంజోత్ కర్లా 9 బంతుల్లో 9 పరుగులు చేసి పృథ్వీ షా కు సహకారం అందించాడు. ఇద్దరు కలిసి విజయానికి కావాల్సిన పరుగులను కేవలం 8 ఓవర్లలోనే బాదేశారు.
Comments
Please login to add a commentAdd a comment