
క్రిస్ట్‌చర్చ్:అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 189 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అటు బ‍్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకోవడంతో సఫారీలపై సునాయాసమైన విజయాన్ని భారత యువ జట్టు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 జట్టు ఎనిమిది వికెట్లకు 332 పరుగులు చేసింది. ఆర్యన్ జుయాల్(86), హిమాన్షు రాణా(68)లు రాణించి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
ఆపై లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైన దక్షిణాఫ్రికా 143 పరుగులకే చాపచుట్టేసింది. భారత పేసర్ ఇషాన్ పోరెల్ చెలరేగిపోయి సఫారీల పతనాన్ని శాసించాడు. పోరెల్ ఎనిమిది ఓవర్లలో 23 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా నడ్డివిరిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జీన్ డు ప్లెసిస్(50) హాఫ్ సెంచరీ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఫలితంగా దక్షిణాఫ్రికా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.