భారత అండర్-19 క్రికెట్ జట్టు(ఫైల్‌ఫొటో)
మౌంట్ మాంగనీ: యువ కెరటాల క్రికెట్ పండుగకు రేపటితో తెరపడనుంది. 22 రోజుల పాటుసాగిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోరు మరికొద్ది గంటల్లో ముగియనుంది. యువ జట్ల మెగా సమరంలో భారత్-ఆస్ట్రేలియాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం ఉదయం గం. 6.30 ని.లకు మౌంట్ మాంగనీ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. తన తొలి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ ఘన విజయం సాధించిన పక్షంలో అదే ఫలితాన్ని అంతిమ సమరంలో కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని ముద్దాడి గత టోర్నీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టిన యువ భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షలోని భారత్ జట్టు తన జైత్రయాత్రను ఫైనల్లో కూడా కొనసాగించి కప్‌ను సొంతం చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. 2000లో మొహ్మద్ కైఫ్ నేతృత‍్వంలోని భారత్ జట్టు.. తొలిసారి అండర్-19 వరల్డ్ కప్‌ను గెలవగా, 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని యువ టీమిండియా రెండోసారి కప్ సాధించింది. ఆపై 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ మరోమారు వరల్డ్‌కప్‌ను అందుకుంది.
అయితే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక కప్‌లు గెలిచిన ఘనత భారత్-ఆసీస్‌లది. ఈ రెండు జట్లు తలో మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఫలితంగా రేపటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచిన కొత్త చరిత్ర లిఖిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉండటంతో మెగా పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ పృథ్వీషాతో పాటు ఓపెనర్ శుబ్‌మాన్ గిల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. మరొకవైపు మన్‌జోత్ కర్లా, అభిషేక్ శర్మలు కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక భారత బౌలింగ్ విభాగంలో శివం మావి,కమలేష్ నాగర్‌కోటిలు తమ పేస్ బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నారు. ఇక స్పిన్ విభాగంలో అనుకుల్ రాయ్ జట్టు అవసరానికి తగ్గట్టు బౌలింగ్ చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. మరి భారత యువ జట్టు వరల్డ్ కప్ గెలిచి కొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment