
సెమీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ పశ్చాత్తాపం
అండర్-19 వరల్డ్కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పట్ల ఆతిథ్య బంగ్లాదేశ్ కెప్టెన్ మెహ్దీ హాసన్ మీరజ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
ఢాకా:అండర్-19 వరల్డ్కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పట్ల ఆతిథ్య బంగ్లాదేశ్ కెప్టెన్ మెహ్దీ హాసన్ మీరజ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.తమ జట్టు మరిన్ని పరుగులు చేయడానికి అవకాశం ఉన్నా అనవసరం వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైనట్లు పేర్కొన్నాడు. ఆ ఓటమికి తాను కూడా పరోక్షంగా కారణమని స్పష్టం చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోవడమే తమ ఓటమికి ప్రధానకారణమన్నాడు. ఆఖరి ఐదు ఓవర్లలో 30 పరుగులు మాత్రమే వచ్చి ఐదు వికెట్లను నష్టపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నాడు.
తాను చివరి వరకూ క్రీజ్ లో ఉండాల్సిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే 250 పరుగులకు పైగా స్కోరు బోర్డుపై ఉండేదని, అప్పుడు విజయంపై ఆశలు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉండేదన్నాడు. తాను అవుటైన మరుసటి బంతికే మహ్మద్ సైఫుద్దీన్ కూడా పెవిలియన్ చేరడం, ఆపై వరుస వికెట్లను చేజార్చుకోవడం ఓటమికి కారణాలని మీరజ్ విశ్లేషించాడు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు. ఈ మ్యాచ్ లో మీరజ్(60), సైఫుద్దీన్(36)ల జోడీ 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో బంగ్లాదేశ్ 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరింది.