సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): పేద కుటుంబంలో పుట్టి.. పోటీ ప్రపంచంలో అవరోధాలన్నీ అధిగమించి అండర్–19 భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎదిగారు గుంటూరుకు చెందిన షేక్ రషీద్. ప్రపంచ్ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించిన ఆయన ఇటీవలే గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని తన ఇంటికి వచ్చారు. బుధవారం తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రషీద్ గురువారం తన అంతరంగాన్ని ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు.
సాక్షి : ప్రపంచ కప్ సాధించడంలో మీ పాత్ర మరువలేనిది. దీనిపై మీ స్పందన ఏమిటీ?
రషీద్: ఏ క్రికెటర్‌కు అయినా ఇది ఓ అదృష్టమే. నాలాంటి వారికి మరీ ప్రత్యేకం. ముఖ్యంగా వెస్టిండీస్ లాంటి టఫ్ వికెట్‌పై ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆడడం అంత సులభం కాదు.
సాక్షి: ప్రపంచ కప్ పోటీల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరు?
రషీద్: వరల్డ్ కప్ ముందు నేను చాలెంజర్స్ ట్రోఫీ, ట్రయాంగిల్ సిరీస్ లాంటి అనేక టోర్నమెంట్లు ఆడి పెద్దపెద్ద బౌలర్లను ఎదుర్కొన్నా. దీనివల్ల వరల్డ్ కప్‌లో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ముఖ్యంగా నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ గురించి ఆలోచించను. ప్రతి బాల్‌నీ బాగా ఆడాలని అనుకుంటాను.
సాక్షి : కరోనా వల్ల ప్రపంచ కప్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు కదా ఎలా ఫీలయ్యారు?
రషీద్: ఇది చాలా దురదృష్టం. కరోనా బారిన పడినప్పుడు నాకు టెస్ట్ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్‌తోపాటు, ఆంధ్రా క్రికెటర్లు జ్ఞానేశ్వర్, వేణుగోపాల్, కోచ్ కృష్ణారావుతోపాటు, ఎంతో మంది రోజూ ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. ఆ స్ఫూర్తితో కోలుకున్న వెంటనే సెమీస్‌లో 94, ఫైనల్స్‌లో 50 పరుగులు చేయగలిగాను. అండగా నిలిచిన క్రికెటర్లందరికీ ధన్యవాదాలు
సాక్షి: పెద్ద మొత్తం నగదు రూపంలో అందుతోంది. ఏం చేద్దామనుకుంటున్నారు?
రషీద్: వరల్డ్ కప్ గెలిచిన వెంటనే బీసీసీఐ రూ.40 లక్షలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ.10 లక్షలతోపాటు, మరికొంత ఇచ్చింది. ఈమొత్తాలను నా కుటుంబ సభ్యుల అవసరాలతోపాటు, భవిష్యత్తు క్రికెట్ అవసరాలకు వినియోగిస్తాను. ఈ మొత్తం నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక చేయూతను ఇచ్చిందనే చెప్పాలి.
సాక్షి: ముఖ్యమంత్రిని కలవడం ఎలా అనిపించింది?
రషీద్: చెప్పేందుకు మాటలు సరిపోవు. మా తండ్రి బాలీషాకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం. జగన్ సార్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం. నువ్వు బాగా ఆడితే జగన్ సార్ వద్దకు తీసుకెళతానని చాలా సార్లు చెప్పారు. జగన్ సార్‌ను చూడాగానే నాకు నోట మాటరాలేదు. ఆయన నా భుజంపై చేయి వేసి ఆట గురించి అడగడం, నేను చెప్పడం అన్నీ కలలాగా అయిపోయాయి. జగన్ సార్ నాకు రూ.10 లక్షల చెక్‌తోపాటు గుంటూరులోనే నివాస స్థలం, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.
సాక్షి : భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?
రషీద్: మన ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడడానికి గురువారం ఉదయం కేరళ వెళుతున్నా. అక్కడ రంజీ మ్యాచ్‌లలో ఉత్తమ స్కోర్లు నమోదు చేయడంతోపాటు, మన జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఆ తరువాత పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాను. ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికీ ముఖ్యంగా మీడియాకు కృతజ్ఞతలు.
సాక్షి: మీ విజయం వెనుక రహస్యం ఏమిటి?
రషీద్: ఇది చెప్పడం చాలా కష్టం. నేను పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నన్ను అక్కున చేర్చుకుని కోచ్ కృష్ణారావు ఓనమాలు నేర్పిన దగ్గర్నుంచి నా కుటుంబ సభ్యులతోపాటు, ఎందరో సహాయసహకారాలు అందించారు. 130 కోట్లు జనాభా ఉన్న మనదేశంలో భారత సీనియర్ జట్టులో స్థానం పొందే రోజుకోసం ఎదురు చూస్తున్నాను. ఈ దేశానికి ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment