పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఆసాంతం విజయపరంపర సాగించిన ‘యువ’భారత్ జట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి ‘కప్పు’ను ముద్దాడింది. అయితే, తమ జట్టు విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది.
(చదవండి : అయ్యో... ఆఖరికి ఓడింది)
విజయానందంలో ఉన్న బంగ్లా ఆటగాళ్లలో ఒకరు టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారు. అసలే ఓటమి బాధలో ఉన్న మన ఆటగాళ్లకు బంగ్లా ఆటగాళ్ల చేష్టలు కోపం తెప్పించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు తోసుకునే దాకా మ్యాటర్ వెళ్లింది. వెంటనే స్పందించిన ఫీల్డ్ అంపైర్లు ఇరువురికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ ట్విటర్‌లో పోస్టు చేశాడు.
బంగ్లా గెలిచిందిలా..!
178 పరుగుల లక్ష్యంతో బంగ్లా ఛేదనకు దిగగా.. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. దీంతో 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి బంగ్లా విజయాన్నందుకుంది. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment