
క్రికెట్‌లో తనకు స్ఫూర్తి సచిన్ టెండూల్కర్ అని, అతనిలా ఆడాలన్నదే తన కోరిక అని భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌లో కీలకం కావాలనేది తన ఆశయమని తెలిపాడు.బుధవారం సీఎంను కలిసిన అనంతరం క్యాంపు కార్యాలయం వెలుపల మీడియా పాయింట్ వద్ద రషీద్ విలేకరులతో మాట్లాడాడు.
అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం పట్ల చాలా ఆనందంగా ఉందని, సీనియర్ వరల్డ్ కప్‌లో ఆడాలన్నదే తన లక్ష్యం అని తెలిపాడు. సీనియర్ ఆటగాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తానన్నాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి షేక్ బాలీషా కష్టపడుతూ తనకు అన్ని విధాలా మంచి సపోర్ట్ ఇచ్చారన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌పై అంతగా ఆలోచన లేదని, రంజీ ట్రోఫీలో బాగా ఆడాలని అనుకొంటున్నానని తెలిపాడు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. ఇంకా బాగా ఆడాలని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా అంతకముందు షేక్ రషీద్‌కు ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు.