ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున రూ.10 లక్షల చెక్కును రషీద్‌కు అందిస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు సుచరిత, ముత్తంశెట్టి, రషీద్ తండ్రి బాలీషా, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావు తదితరులు
సాక్షి, అమరావతి: భారత క్రికెట్ అండర్ –19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను వైఎస్ జగన్ అభినందిస్తూ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం కేటాయింపుతో పాటు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ రషీద్ గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ల రషీద్.. అంతర్జాతీయ క్రికెట్‌లో చక్కగా రాణిస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలో, అండర్ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు. కాగా, రషీద్ సీఎంను కలిసిన సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment