
వచ్చే ఏడాది శ్రీలంకలో జరిగే అండర్ –19 ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. 18 ఏళ్ల తర్వాత ఈ పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొలంబోలో ఈ టోర్నీ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో జనవరి 13న జింబాబ్వేతో ఆతిథ్య శ్రీలంక తలపడనుంది.
ఈ టోర్నీలో పాల్గోనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్-సిక్స్‌లో ప్రదర్శన ఆధారంగా మళ్లీ రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. ఈ రెండు గ్రూపుల్లో మొత్తం 12 జట్లు ఉంటాయి.
ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్ నుంచి రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి. ఫిబ్రవరి 4న కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 14న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 'ఢీ' కొంటుంది.
గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉండగా, గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘సి’లో ఆస్ట్రేలియా, జింబాబ్వే, నమీబియా, ఆతిథ్య శ్రీలంక, గ్రూప్ ‘డి’లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ ఉన్నాయి.