
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో పాక్ జట్టు టీమిండియాకు 173 పరుగులను విజయలక్ష్యంగా నిర్ధేశించింది. భారత బౌలర్ల దాటికి పాక్ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. ఆది నుంచే టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును ఒక ఆట ఆడుకున్నారు. దీంతో పాక్ జట్టులో ముగ్గురు బ్యాట్సమెన్ తప్ప మిగతావారెవరూ రెండెంకల స్కోరు నమోదు చేయలేకపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారనేది అర్థమవుతుంది. పాక్ బ్యాట్సమెన్లలో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్‌లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్సమెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా , రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైస్వాల్‌లు ఒక్కో వికెట్ తీశారు.(పాక్ పనిపడుతున్న టీమిండియా బౌలర్లు)