
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం ఆసీస్‌తో జరిగిన తుది పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం భారత జట్టు సమష్టిగా రాణించడంతో పరాజయమనే మాటే రాకుండా కప్‌ను సగర్వంగా అందుకుంది. ఫలితంగా అత్యధిక సార్లు అండర్-19 వరల్డ్ కప్‌ను గెలిచి కొత్త చరిత్రను లిఖించింది. ఇప్పటివరకూ ఆసీస్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నాలుగు టైటిల్స్ గెలిచిన ఏకైక జట్టుగా ప్రథమ స్థానంలో నిలిచింది.
అంతకుముందు 2000లో మొహ్మద్ కైఫ్ నేతృత‍్వంలోని భారత్ జట్టు.. తొలిసారి అండర్-19 వరల్డ్ కప్‌ను గెలవగా, 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని యువ టీమిండియా రెండోసారి కప్ సాధించింది. ఆపై 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ మరోమారు వరల్డ్‌కప్‌ను అందుకుంది. తాజాగా నాల్గోసారి విశ్వవిజేతగా అవతరించింది. 2016లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ పోరులో చతికిలబడిన యువ భారత్.. ఈసారి జైత్రయాత్రను కడవరకూ కొనసాగించి తమకు తిరుగులేదని నిరూపించింది.శనివారం ఆసీస్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది.