మౌంట్ మాంగనీ: కసిగా ఆడిన యువ టీమిండియా ముందు పటిష్టమైన ఆస్ట్రేలియా పసికూన అయ్యింది. భారత్ ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడిందో.. ఆసీస్ అంత తడబాటుకు గురైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఎందులోనూ పోటీయే లేదసలు. వెరసి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు వరల్డ్ కప్‌ను సాధించింది. గత వరల్డ్ కప్ ఫైనల్లో చేసిన పొరపాట్లకు తావివ్వని భారత జట్టు.. ఈసారి ఫైనల్ ఒత్తిడిని అధిగమించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఫలితంగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అద్భుతమైన గిఫ్ట్‌ను అందించింది.
అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం ఆసీస్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఫలితంగా నాల్గోసారి వరల్ కప్‌ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ వినువీధుల్లో జాతీయ జెండాను ఎగురవేసి భారత కీర్తిని మరింత పెంచింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు ఓపెనర్లు పృథ్వీషా, మన్‌జోత్ కర్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.4 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యం సాధించి పటిష్ట స్థితికి చేర్చారు. పృథ్వీ షా(21) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ మిగతా పనిని మన్‌జోత్ కల్రా(101 నాటౌట్;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్విక్ దేశాయ్(47 నాటౌట్; 61 బంతుల్లో 5 ఫోర్లు)లు పూర్తి చేశారు. శుభ్‌మాన్ గిల్(31) ఆకట్టుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఆటగాళ్లలో జోనాథన్ మెర్లో(76;102 బంతుల్లో 6 ఫోర్లు) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. పరమ్ ఉప్పల్(34),జాక్ ఎడ్వర్డ్స్(28), నాథన్ మెక్ స్వీనీ(23)లు మోస‍్తరుగా రాణించారు. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి ఓ వికెట్ తీశాడు.
భారత జట్టుకు ప్రముఖుల అభినందనలు
నాల్గోసారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందలు తెలియజేశారు. అద్బుతమైన గెలుపుతో ట్రోఫీని సొంతం చేసుకున్న భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మెగా టోర్నీలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడిన భారత కుర్రాళ్లకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి అభినందనలు తెలియజేశారు.
Congratulations to Indian Under 19 cricket team and coach @Im_Dravid on the amazing win. #U19WorldCup. Jai Hind
— YS Jagan Mohan Reddy (@ysjagan) 3 February 2018
Comments
Please login to add a commentAdd a comment