
అండర్ 19 వరల్డ్ కప్ కోచ్ రాహుల్ ద్రవిడ్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్, అండర్ 19 వరల్డ్ కప్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వేలం సంగతి పక్కన పెట్టి.. ముందు ఆటపై దృష్టిసారించాలని యువ ఆటగాళ్లకు ఆయన హితబోధ చేస్తున్నారు. ఐపీఎల్ వేలం కొనసాగుతున్న నేపథ్యంలో ద్రావిడ్ వ్యాఖ్యలను ఈఎస్‌పీన్ క్రిక్‌ఇన్ఫో ప్రముఖంగా ప్రచురించింది.
‘‘సందేహామే లేదు. ఐపీఎల్‌లో తమను కొనుగోలు చేస్తారో? లేదో? అన్న ఆత్రుత యువ ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, వాళ్లు ముందు ఆలోచించాల్సింది తమ ముందు ఉన్న లక్ష్యం గురించి. ఐపీఎల్ అనేది ప్రతీ ఏడాది ఉంటుంది. ఒకటి రెండు అవకాశాలు చేజారిన పెద్దగా బాధపడనక్కర్లేదు. అదేం మీ సుదీర్ఘ కెరీర్ మీద ప్రభావం చూపదు. కానీ, వరల్డ్‌కప్ ఆడే అదృష్టం మీకు పదే పదే మీకు దక్కకపోవచ్చు. కాబట్టి ఆలోచనలను ఆట మీద పెట్టండి’’ అని ది వాల్ యువ ఆటగాళ్లకు సూచించారు. సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనున్న విషయం తెలిసిందే.
అయితే బంగ్లాతో క్వార్టర్ ఫైనల్స్ కంటే ముందే ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అండర్-19 ఆటగాళ్లలో కెప్టెన్ పృథ్వీషాతోపాటు శుభమన్ గిల్, హిమాన్షు రానా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, కమలేష్ నా, హర్విక్ దేశాయ్‌ల పేర్లు ఐపీఎల్ వేలంలో పరిశీలనలో ఉన్నాయి.