U19 WC Final India Vs England: Predicted XI Squads Of Both Teams - Sakshi
Sakshi News home page

U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్‌ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు!

Published Sat, Feb 5 2022 7:22 AM | Last Updated on Sat, Feb 5 2022 10:29 AM

U19 WC Final India Vs England: Predicted XI Squads Of Both Teams - Sakshi

U19 WC Final India Vs England:- నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా): అండర్‌–19 ప్రపంచకప్‌లో ఐదో టైటిల్‌పై యువ భారత్‌ గురిపెట్టింది. టైటిల్‌ ఫేవరెట్‌గా కరీబియన్‌ వచ్చాక... తీరా అసలు మ్యాచ్‌లు మొదలయ్యాక కరోనా కలకలం రేపింది. అయినా సరే కుర్రాళ్ల పట్టుదల ముందు వైరస్‌ కూడా జట్టుపై ప్రభావం చూపలేక తోకముడిచింది. ఇప్పుడు అజేయంగా ఫైనల్‌కు వచ్చింది.

ఎనిమిదో ఫైనల్లో ఐదో చాంపియన్‌షిప్‌పై కుర్రాళ్లంతా మనసు పెట్టారు. అందుకేనేమో భారత అండర్‌–19 జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఎవరెదురైనా అదరగొట్టేస్తోంది. శనివారం వివి యన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీకి యువ భారత్‌ సిద్ధమైంది.  

ఆత్మవిశ్వాసంతో కుర్రాళ్లు 
వరుస విజయాలతో భారత కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా మారింది. బౌలింగ్‌ దళం దుర్భేద్యంగా తయారైంది. అందువల్లేనేమో సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆరంభంలోనే కంగారు పెట్టినా నిలకడైన బ్యాటింగ్‌తో కుదుటపడింది. తర్వాత చెలరేగింది. సెమీఫైనల్లో విఫలమైన ఓపెనర్లు అంగ్‌క్రిష్, హర్నూర్‌ సింగ్‌లు తుదిపోరులో జాగ్రత్తపడాలి.

లోయర్‌ మిడిలార్డర్‌లో నిశాంత్, దినేశ్‌ వరకు జట్టులో మెరుపులు మెరిపించే సమర్థులు ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. నిశాంత్‌ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. అతనితో పాటు రెగ్యులర్‌ బౌలర్లు రవికుమార్, కౌశల్, విక్కీలు శనివారం జరిగే ఆఖరి పోరులో సమష్టిగా జూలు విదిల్చితే అండర్‌–19 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ ఫైవ్‌స్టార్‌ జట్టుగా ఎదుగుతుంది. 

అజేయంగా ఇంగ్లండ్‌ 
భారత్‌లాగే ఇంగ్లండ్‌ కూడా ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్‌ చేరింది. గతంలో ఒక్కసారి (1998) మాత్రమే టైటిల్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు మళ్లీ ఇన్నేళ్లయినా తుదిమెట్టుపై నిలువలేదు. ఇన్నాళ్లకు వచ్చిన టైటిల్‌ అవకాశాన్ని జారవిడవద్దనే కసితో ఆ జట్టు ఉంది. తుది 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్‌ దాకా పరుగులు చేసే సత్తా ఇంగ్లండ్‌ను దుర్భేద్యమైన ప్రత్యర్థిగా మార్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లతో తమకెదురైన ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తూ ఇక్కడికొచ్చింది.

హాట్‌ ఫేవరెట్‌ భారత్‌పై గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్‌తో ఫైనల్‌ హోరాహోరీగా జరగడం ఖాయమైంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ జార్జ్‌ థామస్, కెప్టెన్‌ ప్రెస్ట్‌ సహా మిడిలార్డర్‌లో జార్జ్‌బెల్, అలెక్స్‌ హార్టన్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో బైడెన్, రేహన్‌ అహ్మద్, అస్పిన్‌వాల్‌ ప్రత్యర్థి బ్యాటర్స్‌కు సవాళ్లు విసురుతున్నారు. గత ఈవెంట్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్‌ ఈ సారి ఫలితాన్ని మార్చాలనుకుంటే సమవుజ్జీ అయిన ప్రత్యర్థిని పక్కావ్యూహంతో ‘ఢీ’ కొట్టాల్సి ఉంటుంది.

జట్లు (అంచనా)
భారత్‌ అండర్‌–19: యశ్‌ ధుల్‌ (కెప్టెన్‌) అంగ్‌క్రిష్‌ రఘువంశీ, హర్నూర్‌ సింగ్, షేక్‌ రషీద్, రాజ్‌వర్ధన్, నిశాంత్, దినేశ్, కౌశల్‌ తాంబే, రాజ్‌ బావా, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్‌. 

ఇంగ్లండ్‌ అండర్‌–19: టామ్‌ ప్రెస్ట్‌ (కెప్టెన్‌), థామస్, బెథెల్, జేమ్స్‌ ర్యూ, లక్స్‌టన్, జార్జ్‌ బెల్, రేహాన్‌ అహ్మద్, అలెక్స్‌ హార్టన్, సలెస్, అస్పిన్‌వాల్, జొషువా బైడెన్‌. 

చదవండి: అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement